యూఏవీలతో మావోయిస్టుల ఆనుపానులు తెలుసుకోవచ్చని మాజీ ఐపీఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. విస్తృతంగా వినియోగిస్తే భద్రతాబలగాలకు అదనపు రక్షణ కల్పించవచ్చని చెబుతున్నారు.
‘యుద్ధంలో శత్రువును జయించాలంటే వ్యూహం ముఖ్యం. మన జాడ తెలియకుండానే శత్రువు కదలికలు, ఆనుపానులు పసిగట్టగలిగితే వ్యూహాల అమలు సులభమవుతుంది. చాలావరకూ ప్రాణనష్టం లేకుండా పైచేయి సాధించే వీలుంటుంది. అందుకు యూఏవీలు కచ్చితంగా దోహదపడతాయి’ అని పలువురు ఐపీఎస్ అధికారులు చెబుతున్నారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన యూఏవీలను మరింత విస్తృతంగా సమకూర్చుకుంటేనే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందనేది నిపుణుల మాట.
చెట్లు, పొదల్లో దాక్కున్నా పసిగట్టేస్తాయి
‘ఏకధాటిగా వంద కి.మీ. ప్రయాణించగలిగే, 2 వేల అడుగుల ఎత్తులో ఎగరగలిగే, 24 గంటల పాటు నిరంతరం ఉండగలిగే అత్యాధునిక సాంకేతికతతో కూడిన యూఏవీలు అందుబాటులోకి వచ్చాయి. దట్టమైన చెట్లు, పొదల మధ్య దాక్కొన్న మనుషుల కదలికలను కూడా వారి శరీర ఉష్ణోగ్రతల ద్వారా ఇవి పసిగట్టేస్తాయి. రియల్ టైమ్‌లో దృశ్యాల్ని అందిస్తాయి. భద్రతా బలగాలు ఇలాంటివి సమకూర్చుకోవాలి’ అని ఈ తరహా ఆపరేషన్లలో సుదీర్ఘ అనుభవమున్న ఓ ఐపీఎస్ అధికారి సూచించారు.
మావోయిస్టుల ఉచ్చులో చిక్కకుండా..
‘కొన్ని సందర్భాల్లో భద్రతా సిబ్బందిని మట్టుబెట్టేందుకు మావోయిస్టులే తప్పుడు సమాచారాన్ని భద్రతాబలగాలు, నిఘా వర్గాలకు చేరవేయిస్తుంటారు. ఆ ఉచ్చులో చిక్కుకుని భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో తాజా ఉదంతం ఇలాంటిదే. ఆ ప్రాంతంలో నిజంగా మావోయిస్టులు ఉన్నారా? లేదా నిర్ధారించుకునేందుకు, తదనుగుణంగా వ్యవహరించేందుకు ఈ యూఏవీలు ఉపయోగపడతాయి’ అని ఓ విశ్రాంత ఐపీఎస్ అధికారి అభిప్రాయపడ్డారు.
సీఆర్‌పీఎఫ్‌లో యూఏవీల వినియోగం ఇలా..
* 2010 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు జరిపిన దాడిలో 75 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, ఛత్తీస్‌గఢ్ పోలీసులు బలైపోయారు. దీంతో సీఆర్‌పీఎఫ్ అధికారులు యూఏవీల సాంకేతికత వినియోగించాల్సిన అవసరాన్ని గుర్తించారు. తర్వాత రెండేళ్లకు 2012లో నారాయణపుర్ అటవీ ప్రాంతంలో వీటిని ప్రయోగాత్మకంగా వినియోగించి మావోయిస్టుల కదలికలను పసిగట్టగలిగారు.
* 2017 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని చింతగుహ- బురకాపాల్ మధ్య జరిగిన ఘటనలో మావోయిస్టుల చేతిలో 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు బలైపోయారు. కొన్నాళ్ల తర్వాత అక్కడ కేంద్ర హోం శాఖ ‘ఆపరేషన్ సమాధాన్’కు శ్రీకారం చుట్టింది. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో ఆపరేషన్లు నిర్వహించే భద్రతా బలగాలు కనీసం ఒక పెద్ద, ఒక చిన్న యూఏవీలను వినియోగించడాన్ని తప్పనిసరి చేసింది.
* మే నాటికి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించేందుకు నేత్ర వీ 2 డ్రోన్, మైక్రో యూఏవీ ఏ-410 వంటి వాటిని పెద్దఎత్తున సమకూర్చుకునేందుకు సీఆర్‌పీఎఫ్ సిద్ధమవుతోంది.
యూఏవీల ఉపయోగాలివీ..
* ఆపరేషన్ సమయంలో ముందస్తు హెచ్చరికలు అందుతాయి.
* మాటు వేసిన శత్రువును కనిపెట్టేందుకు ఉపయోగపడతాయి.
* సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
* ఆ ప్రాంత భౌగోళిక స్థితిని అంచనా వేసి, సహజసిద్ధ అవరోధాలను గుర్తించవచ్చు.
కచ్చితంగా అదనపు ప్రయోజనం
‘దట్టమైన అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టేటప్పుడు యూఏవీలను వినియోగించటం భద్రత బలగాలకు కచ్చితంగా అదనపు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ వద్ద అలాంటి యూఏవీలు ఉన్నాయి. అయితే అవి గాలిలో ఎగురుతూ ఉండే సమయం, ప్రయాణించే దూరం, ఎగిరే ఎత్తు, క్లిష్టపరిస్థితుల్ని తట్టుకుని నిలబడే సామర్థ్యం మరీ విస్తృతంగా లేదు. ఆపరేషన్ సమయంలో ఒకదాని తర్వాత ఒకటి నిరంతరాయంగా రెండు, మూడు రోజులైనా గాలిలో ఎగరగలిగేవి అందుబాటులో ఉంటే మరింత మేలు కలుగుతుంది.
వాటిని ఆపరేట్ చేయడం, అందులో వచ్చే చిత్రాల్ని విశ్లేషించగలిగే నైపుణ్యం ఉన్న వారూ అవసరం. మధ్యస్థ స్థాయివి సీఆర్‌పీఎఫ్‌కు బాగా ఉపయోగపడతాయి. ఆపరేషన్ సమయంలో యూఏవీలు వినియోగిస్తే శత్రుమూకలు ఎక్కడున్నాయి? వారి బలం ఎంతుందో కంట్రోల్ రూమ్‌లో ఉన్నవారికి స్పష్టంగా తెలుస్తుంది. దాని ఆధారంగా క్షేత్రంలో ఉన్న బలగాలకు దిశానిర్దేశం చేయొచ్చు. యుద్ధక్షేత్రానికి అన్ని వైపులా 6-7 యూఏవీలను మోహరించగలిగితేనే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. ఆ స్థాయిలో వీటిని సమకూర్చుకోవాలి’ అని సీఆర్‌పీఎఫ్‌లో పదవీవిరమణ చేసిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఒకరు వివరించారు.
ఇదీ చదవండి: