హైదరాబాద్‌లో రూ.కోట్ల విలువ చేసే భూవివాదంలో ముగ్గురు వ్యాపారులను కిడ్నాప్ చేసిన కేసులో గుంటూరుకు చెందిన మాదాల శ్రీను అలియాస్ గుంటూరు శ్రీను పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ పేరు గుంటూరులో చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ పోలీసులు చెబుతున్న ఆ గుంటూరు శ్రీను ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? ఇప్పటికే ఆ భూవివాదం కేసులో అరెస్టు అయిన ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఆ యువకుడు ఎలా దగ్గరయ్యారనేవి ఆసక్తి కాబోతున్నాయి.
గుంటూరు నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ చదివాడు. బ్యాక్‌లాగ్స్ పేరుకుపోవటంతో మధ్యలోనే చదువుకు స్వస్తి పలికారు. సహచర ఇద్దరు విద్యార్థులతో కలిసి 2014లో గుంటూరు బ్రాడీపేటలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఇంటీరియర్ డిజైన్ వర్క్స్ కన్సల్టెన్సీ కంపెనీ ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి 2015లో విద్యానగర్‌లో భూమా నాగిరెడ్డికి చెందిన ఇంటిలో ఇంటీరియర్ వర్క్స్ పనులు చేసే కాంట్రాక్టు దక్కింది. ఆ పనుల నిర్వహణలో భాగంగా శ్రీనుకు భూమా నాగిరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఫ్యాక్షన్ నేతగా ముద్రపడిన భూమా వద్దకు వచ్చిపోయే అభిమానులు, అనుయాయుల హడావుడి వంటివి శ్రీనును భూమా నాగిరెడ్డికి దగ్గరయ్యేలా చేశాయని రాజకీయాల్లో ఉండే నాయకుడు చెబుతున్నారు.
ఇంటీరియర్ పనుల బిల్లుల కోసం తరచూ నాగిరెడ్డి వద్దకు వెళుతూ ఉండేవారని, అలా అఖిలప్రియకు సన్నిహితంగా మారారని చెబుతున్నారు. నాగిరెడ్డి మరణానంతరం అఖిలప్రియ మంత్రి అయ్యారు. గుంటూరు నుంచి విజయవాడకు ఆమె మకాం మారటంతో అక్కడ ఇంటి నిర్వహణ పనులు చక్కబెడుతూ ఆమెకు అనుయాయుడిగా మారారని చెబుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అఖిలప్రియతో పాటే ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.
మంత్రి హోదాలో అఖిలప్రియ ఓ రోజు గుంటూరులోని శ్రీను నివాసానికి వచ్చారు. అది కూడా అతన్ని బాగా ఆకర్షితులను చేసింది. తనకు ఏ రాజకీయ నేపథ్యం లేకున్నా మంత్రి తన ఇంటికి వచ్చారని సన్నిహితుల వద్ద అంటుండేవారని సమాచారం. మొత్తంగా భూమా కుటుంబానికి ఇలా దగ్గరైన ఆయువకుడు 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖిలప్రియ ఓటమి అనంతరం కూడా ఆమెతోనే ప్రయాణం చేస్తున్నారు. సుమారు రెండేళ్ల నుంచి శ్రీను ఇక్కడ ఉండటం లేదని గుంటూరులోని డొంకరోడ్డు ప్రాంత నివాసులు కొందరు తెలిపారు.
ఆయన తండ్రి రమణయ్య నగరంలో కొన్నాళ్లు టీస్టాల్ నిర్వహించారు. వడ్డీ, స్థిరాస్తి వ్యాపారాలు ఉన్నాయి. శ్రీను తండ్రి రమణయ్య ఆరేడు మాసాల కిందట ఓ దొంగబంగారం కేసులో అభియోగాలు ఎదుర్కొన్నారని తెలిసింది. అరండల్‌పేట స్టేషన్ పరిధిలో నివాసం ఉండే శ్రీనుపై ఎలాంటి పోలీసు కేసులు లేవని పోలీసువర్గాలు తెలిపాయి.
కుటుంబీకుల ఫోన్లు స్విచ్డ్‌ఆఫ్
తాజా పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు శ్రీను కోసం ఆరా తీస్తున్నారు. మరోవైపు గత మూడు రోజుల నుంచి శ్రీను తల్లిదండ్రులు కూడా గుంటూరులోని ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారని తెలుస్తోంది. శ్రీను కోసం తెలంగాణ పోలీసులు ఏమైనా గుంటూరుకు వచ్చారా అని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని వివరణ కోరగా తమకు సమాచారం లేదన్నారు.
ఇదీ చదవండి: