Rajagopala Reddy fire on kcr family: తెలంగాణలో 18లక్షల ఎకరాల భూములు కాజేయాలని కేసీఆర్ కుటుంబం కుట్ర చేసిందని మునుగోడు భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మునుగోడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సామాన్యుల నుంచి భూములు లాక్కోవాలని పథకం ప్రకారమే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చారని విమర్శించారు.
‘‘ధరణి ద్వారా రాష్ట్రంలోని దాదాపు 18లక్షల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు కేసీఆర్ చేతుల్లోకి వెళ్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఎంతో విలువైన భూములు ఉన్నాయి. సామాన్యుల నుంచి వాటిని కాజేయాలని కుట్ర చేశారు. రూ.18లక్షల కోట్లతో దేశంలో అతిపెద్ద కుంభకోణం చేశారు. భారతదేశంలో ఇప్పటివరకు ఇలాంటి స్కాం ఎక్కడా జరగలేదు. భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి. కేసీఆర్, కేటీఆర్‌కు కలిపి 60 ఎకరాల భూమి మాత్రమే ఉందని 2013లో కేసీఆర్ చెప్పారు. కానీ కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోని 600 ఎకరాల వివరాలు ధరణి పోర్టల్‌లో లేవు. ఆ భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలియట్లేదు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ధరణి పోర్టల్ అవినీతిపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం’’ అని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి: