‘ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల, జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్టు (ఏపీలిప్) పనులు నెమ్మదించడంపై తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తున్నాం. మా రుణంలో నాలుగేళ్లలో 4.68% పనులే పూర్తయ్యాయి. రాష్ట్రప్రభుత్వం వద్ద నిధుల కొరత, చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్టు పూర్తిచేసేందుకు ఇక మూడేళ్లే మిగిలింది. వెంటనే బిల్లులు చెల్లించి పనులు ముందుకు సాగేలా చూడాలి’ అని జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ సంస్థకు భారతదేశ కార్యాలయంలో ఉన్న సీనియర్ ప్రతినిధి రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌కు ఈ లేఖ రాశారు.
‘మీరు బిల్లులు చెల్లించి, ఆ విషయాన్ని మాకు తెలియజేస్తే ఆ సొమ్ము తిరిగి చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తాం’ అని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017లో జైకాతో ఈ ప్రాజెక్టుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.2,000 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించింది. జైకా రూ.1683.30 కోట్ల (84.16%) రుణం ఇస్తుంది. మిగిలిన మొత్తం (15.84%) రాష్ట్రం భరించాలి. ఈ నిధులతో ఒక కొన్ని పనులు చేపట్టారు. తొలుత రాష్ట్రం నిధులు ఖర్చుచేస్తే, తర్వాత జైకా ఆ మొత్తాన్ని రుణంగా ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఈ పనుల్లో పురోగతి లేకపోవడంతో ఇప్పుడు జైకా లేఖ రాసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు నెలాఖరు వరకు ఏపీలిప్ ప్రాజెక్టులో రూ.4.60 కోట్లే చెల్లించారని ప్రస్తావించింది. సీఎఫ్‌ఎంఎస్‌లో రూ.64 కోట్లకు బిల్లులు సమర్పించినా, ఆ మొత్తం ఆర్థికశాఖ ఇంకా చెల్లించలేదని చెప్పింది.
ఇదీ చూడండి: