మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై జనసేన, కాంగ్రెస్ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. గతంలో ఎన్నికల ప్రక్రియను నిలిపివేసిన చోట నుంచి కొనసాగించాలనే నిర్ణయం సరికాదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
కొత్తగా ప్రక్రియ ప్రారంభించేందుకున్న అవకాశాలను పరిశీలించాలని ఎన్నికల కమిషన్‌కు నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. కొవిడ్ దృష్ట్యా గతేడాది మార్చి 15న ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని తాము స్వాగతించామని చెప్పారు. ఈ సంవత్సర కాలంలో అభ్యర్థులను, ఓటర్లను అధికారపక్షం మభ్యపెట్టిందని విమర్శించారు. ఆగినచోట నుంచి తిరిగి ఎన్నికలు ప్రారంభించడం ప్రజాస్వామ్యబద్ధం కాబోదని ఆయన అన్నారు.
గత నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం దురదృష్టకరమని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దౌర్జన్యాలు, బెదిరింపులతో ఏకగ్రీవాలు జరగటం చూస్తున్న ఎస్ఈసీ.. పాత నోటిఫికేషన్‌ను కొనసాగించటం నిరాశకు గురి చేసిందన్నారు. ఓటర్ల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఎస్ఈసీకి ఉందన్నారు.
ఇదీ చదవండి: మార్పుకి సంకేతం.. స్థానిక సమరంలో యువత