రాజధాని అమరావతి, అక్కడి గ్రామాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జనసేన పార్టీ 20 పేజీల నివేదిక రూపొందించింది. ఇటీవల రాజధాని గ్రామాల్లో పర్యటించిన నాదెండ్ల మనోహర్, నాగబాబు.. తాము పరిశీలించిన అంశాలతో పాటు అమరావతి స్వరూపం, అక్కడి నిర్మాణాలు తదితర అంశాలపై నివేదికను తయారు చేశారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అందజేశారు. అమరావతి విస్తీర్ణం, భూసమీకరణ, రైతులకు ఇచ్చిన హామీలు, కౌలు, అక్కడ పూర్తయిన నిర్మాణాలు, ప్రభుత్వ కార్యకలాపాలు, హైకోర్టు, ప్రస్తుతం వివిధ స్థాయిల్లో ఉన్న నిర్మాణాల వివరాలు పొందుపర్చారు. రైతుల ఆందోళనలనూ ప్రస్తావించారు.
జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు గతంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ రాజధాని అంశంపై ఏం చెప్పాయనేది నివేదికలో వివరించారు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు అని చెబుతున్న ప్రభుత్వం.. రెవెన్యూ లోటు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు తరలించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా తేల్చారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రాబడి, వ్యయాన్ని పరిశీలిస్తే... ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 22,112 కోట్ల రూపాయలుంటే.. అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు హయాంలో రాజధానికి నిధుల కేటాయింపు ఎలా జరిగింది... వైకాపా ప్రభుత్వం మొదటి బడ్జెట్లో 500 కోట్లు మాత్రమే కేటాయించిన విషయం కూడా నివేదికలో వివరించారు. అన్ని అంశాలపై పార్టీ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఇదీ చదవండి