రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల కిలోమీటర్ల పొడవునా 68 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్టు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంపై రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలకు మంత్రి పెద్దిరెడ్డి , ఆ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
ఆగస్టు 15 నాటికి మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది 44 వేల మంది రైతులకు చెందిన 70 వేల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించుకోవాలని అధికారులకు సూచించారు. పంచాయతీ సర్పంచ్, గ్రామ సెక్రటరీలకు ప్రభుత్వ స్థలాల్లో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు మంత్రి తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలకు ట్రీగార్డులు, సంరక్షణ నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రతీ కిలోమీటర్‌కు 400 మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్ అసత్యాలను వాస్తవాలతో తిప్పికొట్టండి'