అమరావతికి శంకుస్థాపన జరిగి నేటికి 5 ఏళ్లు. అంతా సక్రమంగా జరిగి ఉంటే.. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతిలో పరిపాలన నగరం దాదాపు పూర్తయ్యేది. ప్రభుత్వ సంస్థలు, విద్యాలయాలు, ఇతర సంస్థల భవనాల నిర్మాణం చురుగ్గా సాగుతుండేది. వేల సంఖ్యలో కార్మికులతో, రాజధానికి తరలివచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వాణిజ్య కార్యకలాపాలతో సజీవ స్రవంతిలా కనిపించేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అమరావతిలో పనులు నిలిపేయడం, మూడు రాజధానుల చట్టం తేవడంతో.. ఇప్పుడు రాజధాని వీధుల్లో, నిర్మాణ పనులు నిలిచి నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. రాజధానికి భూములిచ్చిన రైతుల ఆక్రందన అడుగడుగునా ప్రతిధ్వనిస్తోంది.
ఒక మహానగరాన్ని నిర్మించుకోవాలన్న ఆశ, దాన్ని ప్రజారాజధానిగా మలచుకోవాలన్న ఆకాంక్షలతో మొదలుపెట్టిన అమరావతి నిర్మాణానికి అయిదేళ్ల కిందట విజయదశమినాడు శంకుస్థాపన జరిగింది. ప్రధాని మోదీ, నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అప్పటి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, అసోం గవర్నర్ పీబీ ఆచార్య, నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, సింగపూర్ మంత్రి ఈశ్వరన్, జపాన్ మంత్రి యుసుకె టకారీ తరలివచ్చారు. అమరావతి ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా విరాజిల్లాలని ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
నాడు ప్రధాని మోదీ ఏమన్నారంటే..
2015 అక్టోబరు 22న ఉద్ధండరాయునిపాలెం వద్ద రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. నాటి సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..
విజయదశమి పర్వదినాన ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యాయంలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. శతాబ్దాల చరిత్ర, ఘనమైన సంస్కృతితో తులతూగుతున్న అమరావతి.. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుని ఆంధ్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు కేంద్ర స్థానంగా, ప్రజా రాజధానిగా ఆవిర్భవించనుంది. అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ సాగించే ప్రయాణంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడుంటుందని హామీ ఇస్తున్నా. విభజన చట్టంలో చెప్పినవన్నీ తూచ తప్పక అమలు చేస్తామని అమరావతి వేదికగా ప్రకటిస్తున్నా. మనకు కొత్త నగరాల అవసరం ఎంతో ఉంది. దేశంలో పట్టణీకరణ దిశగా వేసిన కొత్త అడుగుకు ఆంధ్రప్రదేశ్, అమరావతి మార్గదర్శిగా నిలుస్తాయని ఆశిస్తున్నాను.
అమరావతి భవిష్యత్తు సురక్షితం
- వెంకయ్య నాయుడు (కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హోదాలో)అమరావతి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అజరామరమై నిలుస్తుంది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు, రెడ్డిరాజుల నుంచి ఆఖరికి ధరణి కోటను పరిపాలించిన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి వరకు మనకు ఘనమైన చరిత్ర ఉంది. దాన్ని కాపాడుకునేందుకు మనమంతా కృషి చేయాలి.
మేటి రాజధానిని నిర్మిస్తాం
- చంద్రబాబు (ఏపీ సీఎం హోదాలో)ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తాం. ఇది ప్రజా రాజధాని. ప్రజల భాగస్వామ్యం అవసరం. అమరావతికి ఘన చరిత్ర ఉంది. ఈ ప్రాంతానికి ఈశాన్యంలో నీరు ప్రవహిస్తోంది. అమరావతిని అత్యుత్తమమైన ప్రజా రాజధాని నగరంగా తీర్చిదిద్దుతాం.
అమరావతి అద్భుతంగా సాగాలి
- కేసీఆర్, తెలంగాణ సీఎంవిజయదశమి రోజు ప్రారంభమైన అమరావతి ప్రస్థానం అద్భుతంగా సాగాలి. ప్రపంచంలోనే గొప్ప నగరంగా రూపుదిద్దుకోవాలి. ఇందుకు అవసరమైన సహాయ సహకారాల్ని తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుంది.
అభివృద్ధి జరిగిందిలా..
- అమరావతి నిర్మాణానికి రూ.10 వేల కోట్లకు పైగా సాయం కావాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు, ఆకర్షణీయ నగరాల అభివృద్ధి ప్రాజెక్టు కింద మరో రూ.800 కోట్ల వరకు నిధులిచ్చింది. గుంటూరులో భూగర్భ మురుగునీటిపారుదల, విజయవాడలో వర్షపు నీటిపారుదల వ్యవస్థల ఏర్పాటుకు కలిపి రూ.1000 కోట్లు అందించింది.
పరిపాలన నగర నిర్మాణానికి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శంకుస్థాపన చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు రెండేళ్లపాటు కేపిటల్ గెయిన్స్ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. - రైతుల్ని ఒప్పించి ప్రభుత్వం భూసమీకరణ ప్రారంభించింది. రెండు నెలల్లోనే 29 వేల మందికిపైగా రైతులు 34 వేల ఎకరాల్ని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు అంగీకారపత్రాలు అందజేశారు.
- ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే రెండేళ్లు పడుతుంది. అలాంటిది తెదేపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలోనే రాజధానికి భూసమీకరణ, ప్రణాళికలు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు తదితర భవనాలకు ఆకృతుల రూపకల్పన పూర్తయింది. నిర్మాణాల ప్రక్రియా వేగంగా కొనసాగింది.
- 2015 జూన్ నాటికి రాజధానిలో మౌలిక వసతులు, పరిపాలనా నగరానికి బృహత్‌ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రధాన మౌలిక వసతుల నిర్మాణానికి రూ.53 వేల కోట్లతో అంచనాలు సిద్ధమయ్యాయి. రూ.10 వేల కోట్ల విలువైన పనులు జరిగాయి.
- వెలగపూడిలో ప్రస్తుత సచివాలయం, శాసనసభ, హైకోర్టు నిర్మాణం పూర్తయి వాటిలో కార్యకలాపాలు నడుస్తున్నాయి.
- 145 సంస్థలకు భూములు కేటాయించారు. విట్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలు వచ్చాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నిర్మాణం దాదాపు కొలిక్కివచ్చింది.
- సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, హైకోర్టు భవనాల పనులు ప్రారంభమయ్యాయి. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ఇతర అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు వేల సంఖ్యలో నివాసగృహాల టవర్ల నిర్మాణం కొలిక్కి వచ్చింది. మంత్రులు, న్యాయమూర్తుల బంగ్లాల నిర్మాణం మొదలైంది.
- రాజధానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్లలో మౌలిక వసతుల పనులూ ప్రారంభమయ్యాయి.
- రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణ కోసం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అమరావతి బాండ్లు విడుదల చేస్తే రెండు గంటల్లోనే రూ.2 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు ఆన్‌లైన్‌లో ఫ్లాట్లు బుకింగ్ నిర్వహిస్తే.. కొన్ని గంటల వ్యవధిలోనే 1200 ఫ్లాట్లు బుక్కయ్యాయి.
విధ్వంసం సాగుతోందిలా..
- అమరావతి పనులు నిలిపివేయాలన్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజల ఆశల్ని చిదిమేశాయి. వైకాపా అధికారంలోకి రాగానే రాజధానిలో పనులన్నీ ఎక్కడికక్కడ నిలిపివేసింది. అమరావతి ముంపు ప్రాంతమని, కృష్ణా నదికి వరదలొస్తే అదంతా మునిగిపోతుందని మంత్రులు, అధికార పార్టీ నాయకులు పదేపదే వ్యాఖ్యానించారు.
- మరోపక్క రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన పేరుతో జీఎన్ రావు కమిటీని ప్రభుత్వం నియమించింది. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్‌కీ బాధ్యతలు అప్పగించింది. వాటి నివేదికలు రాకముందే ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రస్తావన చేశారు. తర్వాత ఆ రెండు కమిటీలూ మూడు రాజధానులు ఉండాలని నివేదించాయి.
- రూ.వేల కోట్లతో చేపట్టిన నిర్మాణాలు 16 నెలలుగా నిలిచిపోవడంతో అవి పాడవుతున్నాయి.
వాళ్లు వెళ్లిపోయారు
- రాజధానిలో అంకురప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టిన సింగపూర్ ప్రభుత్వం.. వైకాపా ప్రభుత్వ వైఖరి చూసి ఒప్పందం రద్దు చేసుకుని వెళ్లిపోయింది.
- అమరావతికి జపాన్ నుంచి పెట్టుబడులు ఆకర్షించేలా ఆ దేశ ప్రభుత్వం వెయ్యి చ.మీ.ల విస్తీర్ణంలో ‘హ్యూమన్ ఫ్యూచర్ పెవిలియన్’ పేరుతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. వాళ్లూ వెళ్లిపోయారు.
- రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో రాజధానికి రూ.3,500 కోట్ల రుణం ఇచ్చే ప్రతిపాదనను ప్రపంచబ్యాంకు రద్దు చేసుకుంది.