IT Employees : కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన ఐటీ ఉద్యోగులు.. తిరిగి కార్యాలయాలకు వచ్చేందుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గుచూపుతున్నారు. యాజమాన్యాలు కచ్చితంగా కార్యాలయాలకు రావాల్సిందేనని ఆదేశిస్తే.. ఆఫీసులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
మునుపటికి భిన్నంగా పని విధానంలో మార్పులు, ఒత్తిడి లేని వాతావరణం, మంచి ఫర్నిచర్, ఓపెన్ ఆఫీస్ విధానం, ఆలోచనలు బదిలీ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. స్వతంత్రంగా పనిచేసే సౌలభ్యం ఉండాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలికాక హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, ముంబయి సహా దేశంలోని మెట్రో నగరాల్లోని ఐటీ ఉద్యోగుల్లో పది మందిలో సగటున ఆరుగురు ఆఫీసుల్లో మంచి వసతులు కల్పించాలని కోరుతున్నట్లు సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
ఇంటి నుంచే ఇష్టం : హైదరాబాద్‌లోని ఐటీ సంస్థల్లో ప్రస్తుతం 6 లక్షల మంది వరకూ పనిచేస్తున్నారు. కరోనా తీవ్రత తగ్గడంతో సంస్థలు మార్చి నుంచి కార్యాలయాలకు రావాలని పిలుపునిస్తున్నాయి. ఇందుకోసం రిటర్న్ టూ ఆఫీస్ సమాచారాన్ని పంపిస్తున్నాయి. తొలుత వారంలో సగం రోజులే కార్యాలయాల్లో పనిచేసే హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను అమలు చేస్తున్నాయి. కొందరు ఉద్యోగులు కార్యాలయాల్లో, పని విధానంలో మార్పులు కోరుతున్నట్లు సర్వే తెలిపింది. గతానికి భిన్నంగా మంచి వసతుల్ని ఆశిస్తున్నారు. ముఖ్యంగా సౌకర్యంగా ఉండాలన్న ఆలోచనతో ఉంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఇంటి నుంచే విధులు నిర్వహించడంలో ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. కార్యాలయంలో అదే విధంగా సానుకూల వాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు.
సర్వేలో ప్రధానాంశాలు!
*సర్వేలో పాల్గొన్న వారిలో 80- 90 శాతం మంది విధులు ఎక్కడినుంచైనా నిర్వహించే వెసులుబాటు ఉండాలని కోరుతున్నారు.
*కార్యాలయం ఆలోచనల్ని పంచుకునే వేదికలా ఉండాలని భావిస్తున్నారు.
*సమాచార బదిలీ ద్వారా ఎక్కువ విషయం నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
*ఇందుకు అనుగుణంగా ఆఫీసులో మౌలిక వసతుల్లో మార్పులు ఉండాలని కోరుతున్నారు. ఓపెన్ ఆఫీస్ తరహాలో ఉండాలని భావిస్తున్నారు.
ఇవీ చదవండి :