శరీరాన్ని మించిన టీకా ఫ్యాక్టరీ మరేదీ లేదు. తనను దెబ్బతీయాలని ప్రయత్నించే సూక్ష్మక్రిములను మట్టుబెట్టే సాధన సంపత్తిని సమకూర్చుకోవటం శరీరానికి పుట్టుకతో అబ్బిన విద్య. ఎప్పటికప్పుడు రోగనిరోధకశక్తిని ప్రేరేపించి, యాంటీబాడీలతో దాడికి దిగుతుంది. కొత్త క్రిములు విజృంభించినప్పుడే కాస్త తడబడుతుంటుంది. వాటిపై పైచేయి సాధించటానికి పోరాటం చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు చేతులెత్తేస్తుంది. అలాగని పోరాటం ఆపదు. సరిగ్గా ఇక్కడే కొంత దన్ను అవసరం. టీకా అందించేది ఇలాంటి బలమే. కొవిడ్-19ను అంతం చేయటానికి ఇప్పుడిదే వజ్రాయుధం కానుంది.
యాంటీబాడీలు ఉత్పత్తయ్యేలా చేస్తాయి
వైరస్ వాహకం, నిర్వీర్య వైరస్, వైరస్ ఆర్‌ఎన్‌ఏ.. ఇలా ఎలాంటి పరిజ్ఞానంతో తయారైనవైనా అన్ని టీకాలు మన మేలు కోసం పుట్టుకొచ్చినవే. సార్స్-కోవీ2 మాదిరిగానే ఇవీ రోగనిరోధకశక్తిని ప్రేరేపిస్తాయి గానీ జబ్బును కలగజేయవు. కొవిడ్-19ను ఎదుర్కోవటానికి అవసరమైన యాంటీబాడీలు ఉత్పత్తయ్యేలా చేస్తాయి. ఎందుకనో గానీ టీకాలనగానే కొందరు తెగ బెంబేలెత్తిపోతుంటారు. తెలిసీ తెలియని వాళ్లు చెప్పినవే నిజమనుకొని లేనిపోని అపోహలు పెంచుకుంటుంటారు. ఇది మంచిది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది కొవిడ్-19 టీకాలను తీసుకున్నారు. మనదేశంలోనూ ఆరంభించారు. ఎక్కడా, ఎవరికీ హాని జరగలేదు. కాబట్టి భయపడాల్సిన పనిలేదు. సందేహాలను నివృత్తి చేసుకొని స్వచ్ఛందగానే ముందడుగు వేయాలి. ఎవరికివారే టీకా ప్రాప్తిరస్తు అని దీవించుకోవాలి. ఇప్పటివరకూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతికిన రోజులకు మంగళం పాడాలి.
కొవిడ్-19 టీకా అందరూ తీసుకోవాలా?
కరోనా జబ్బు వచ్చినా, రాకున్నా అందరూ టీకా తీసుకోవాల్సిన అవసరముంది. ఇప్పటికే కొవిడ్-19 వచ్చినవారిలో సహజంగానే రోగనిరోధకశక్తి పుట్టుకొచ్చి ఉండొచ్చు. ఇది ఎంతకాలం రక్షణ ఇస్తుందనేది కచ్చితంగా తెలియదు. అధ్యయనాల్లో రకరకాల ఫలితాలు వెలువడుతున్నాయి. కొన్ని 4 నెలల వరకు, మరికొన్ని 6-8 నెలల వరకు రక్షణ ఉంటుందని పేర్కొంటున్నాయి. ఇది మళ్లీ ఇన్‌ఫెక్షన్ రాకుండా నివారిస్తుందా? లేకపోతే జబ్బు తీవ్రం కాకుండా చూస్తుందా? మరణాలను ఆపుతుందా? అనేవీ తెలియవు. కాబట్టి అంతా టీకా తీసుకోవటం మంచిది. టీకా తీసుకుంటే జబ్బు తలెత్తకుండానే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు పుట్టుకొస్తాయి. కొవిడ్-19 వ్యాపించకుండా, జబ్బు తీవ్రం కాకుండా చూడటంలో సహజ, టీకా రోగనిరోధకశక్తి రెండూ కీలకమే.
ఇందుకు టీకా ఉపయోగపడుతుంది
వైరస్ జన్యుపరంగా చాలా వేగంగా మార్పు చెందుతోంది. ఇలాంటి తరుణంలో ఎంత త్వరగా టీకా తీసుకుంటే అంత మంచిది. టీకా తీసుకోవటం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడినా తప్పకుండా తీసుకోవటమే ఉత్తమం. మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి సమస్యలు గలవారికిది మరింత ముఖ్యం. ఎందుకంటే ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి కొవిడ్ ముప్పు ఎక్కువ. తొలివిడతలో వైద్య సిబ్బంది.. పోలీసులు, రెవెన్యూ, పురపాలక ఉద్యోగులు.. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడ్డవారికి.. మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులు గలవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మనం ఒక కొత్త వైరస్‌తో పోరాడుతున్నాం. దీంతో తలెత్తే ఇన్‌ఫెక్షన్‌కు కచ్చితమైన, ప్రామాణిక మందులేవీ లేవు. అన్నీ ప్రయోగాత్మకంగా, అనుభవంతో వాడుతున్నవే. అదృష్టం కొద్దీ కరోనా జబ్బులో మరణాల సంఖ్య తక్కువగానే ఉంటున్నప్పటికీ వీటిని సైతం ఆపాలన్నదే మన లక్ష్యం. ఇందుకు టీకా ఎంతగానో ఉపయోగపడుతుంది.