ధ్యానంతో ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు సాధించవచ్చని రైల్వే సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య, అడిషనల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌తో పాటు..అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కొవిడ్ దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా దినోత్సవంలో భాగంగా జోన్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ మొత్తం 6 డివిజన్లు ఇతర రైల్వే వర్క్ షాపులలో, ట్రైనింగ్ కేంద్రాల నుంచి రైల్వే సిబ్బంది వర్చువల్ విధానంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రముఖ యోగా గురువు, హైదరాబాద్‌కు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్టేట్ కో`ఆర్డినేటర్ శ్రీ మురారి మోహన్ ఈ కార్యక్రమంలో పలు ఆసనాలు వేయించారు. ప్రాణాయామం, ధ్యానం, సంకల్పం వంటి ప్రక్రియలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వారిచేత.. రోజూ యోగా చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. నిత్యం యోగా చేయడం వల్ల మంచి ఆరోగ్యం, స్పష్టమైన ఆలోచనలు, ఆధ్యాత్మిక క్రమశిక్షణ సాధ్యమవుతుందని శ్రీ మురారి మోహన్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ గజానన్ మాల్య శ్రీ మురారి మోహన్‌ను సన్మానించారు.
ఇదీ చదవండి: Perni nani: 'కరోనా వల్ల అవసరమైన ఉద్యోగాలతోనే జాబ్ క్యాలెండర్'