AP High Court: అనిశా పూర్వ డీజీ, ప్రస్తుత నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. ఎస్‌ఎల్‌వీ ఎడ్యుకేషనల్ సొసైటీపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులో అభియోగపత్రం దాఖలు చేయడంలో చోటు చేసుకున్న జాప్యానికి క్షమాపణలు కోరారు. దిగువస్థాయి అధికారులు అలసత్వంతో జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుత కేసు విషయంలో అభియోగపత్రం వేశామన్నారు. ఆ వివరాలను నమోదు చేసిన ధర్మాసనం తదుపరి విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. అభియోగపత్రం, తదితర వివరాలను కోర్టులో దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర , జస్టిస్ ఎం . సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది . ప్రకాశం జిల్లా కొమరోలులోని ఎస్‌ఎల్‌వీ ఎడ్యుకేషనల్ సొసైటీపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో కేసు నమోదు చేసి ఏళ్లుగడుస్తున్నా అభియోగపత్రం దాఖలు చేయడంలో జాప్యంపై అనిశా డీజీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది . 2018 లో కేసు నమోదు అయిన కేసులో ఇప్పటి వరకు ఛార్జిషీట్ వేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది. అనిశా కేసుల్లో దర్యాప్తు , అభియోగ పత్రాల దాఖలులో ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఆక్షేపించింది. రికార్డులతో హాజరై వివరణ ఇవ్వాలని అనిశా డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులుని ఆదేశించింది . తాజాగా విచారణకు అధికారి హాజరై అభియోగపత్రం వేశామని వివరణ ఇవ్వడంతో ధర్మాసనం సంతృప్తి చెందింది.
ఇదీ చదవండి: శ్రీలక్ష్మిపై హైకోర్టు వ్యంగ్యాస్త్రం... ఆమే 'సిన్సియర్' సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అంటూ..