తెలంగాణలోని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దుపై తమను సంప్రదించకుండానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీఎస్ ప్రభుత్వం ఆక్షేపించింది. శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్న అంశాన్ని కేంద్రం విస్మరించిందని హైకోర్టులో అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదించారు. చెన్నమనేని ప్రస్తుతం దేశంలోనే ఉన్నారని..రాష్ట్ర చట్టసభలో సభ్యుడిగా ఉన్నారన్నారు. పూర్తి వివరాలతో ప్రభుత్వం తరఫున కౌంటరు దాఖలు చేసేందుకు నెల రోజులు గడువు ఇవ్వాలని అదనపు ఏజీ కోరారు. ఈ అంశంపై గతంలో ఎన్నికల ట్రైబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు వాదనలు జరిగాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ స్పందించ లేదని చెన్నమనేనిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్ వాదించారు. పౌరసత్వం వివాదం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు కూడా వినేందుకు అంగీకరించిన హైకోర్టు కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది.
తన పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని రమేశ్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి విచారణ చేపట్టారు. నెల రోజులుగా గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా..పూర్తి స్థాయి భౌతిక విచారణలు ప్రారంభమయ్యాక చేపట్టాలని చెన్నమనేని రమేశ్ తరఫు న్యాయవాది కోరారు. అయితే కోర్టు అడిగిన వివరాలు, దస్త్రాలు అన్నీ సమర్పించామని, విచారణకు ఎక్కువ సమయం అవసరం లేదని వారం రోజుల్లో జరపాలని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు కోరారు. జర్మనీ పౌరుడు పదేళ్లు చట్టసభలో ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని వీలైనంత త్వరగా తేల్చాలని ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్ కోరారు. అందరి వాదనలు వరిగణనలోకి తీసుకున్న హైకోర్టు విచారణను 2 వారాలకు వాయిదా వేస్తూ.. తుది వాదనలకు అందరూ సిద్ధం కావాలని ఆదేశించింది.
ఇదీ చూడండి: విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారు: చంద్రబాబు