కరోనాతో నష్టాలను మూటగట్టుకున్న ఏపీఎస్ ఆర్టీసీ క్రమంగా గాడిన పడుతోంది. రోజువారీ రాబడి సగటున రూ.8.5 కోట్లకు, ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) 69 శాతానికి చేరింది. మొత్తం 11,600 సర్వీసులకు ప్రస్తుతం నిత్యం సగటున 6,500 వరకు నడుపుతున్నారు. రోజువారీ రాబడి సగటున రూ.8.5 కోట్లు ఉండగా, కొన్నిసార్లు రూ.10 కోట్లకుపైగా వస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు రోజువారీ రాబడి రూ.13-14 కోట్లు ఉండేది. అక్టోబరులో రూ.6 కోట్ల నుంచి రూ.6.5 కోట్లకు చేరింది. ఇక ఓఆర్ గత నెలలో 60.5% ఉండగా, ఇపుడు 69 శాతానికి చేరింది. గతంలో నిత్యం 43 లక్షల కి.మీ. మేర సర్వీసులు నడుపుతుండగా, ప్రస్తుతం 29 లక్షల కి.మీ. నడుస్తున్నాయి.
కరోనాకు తోడైన చలి: కరోనా భయం వెంటాడుతున్న తరుణంలో ఏసీ బస్సుల కంటే నాన్ ఏసీ బస్సుల్లో ప్రయాణానికే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఆర్టీసీలో 244 ఏసీ బస్సులుండగా 84 సర్వీసులను మాత్రమే నడుపుతున్నప్పటికీ వాటిలో సీట్లు కూడా పూర్తిగా నిండటం లేదు. ఆర్టీసీలో సగటు ఓఆర్ 69% ఉండగా, ఏసీ అమరావతి సర్వీసుల్లో 44%, ఇంద్రలో 58% ఉంటోంది. కరోనాకు తోడు, చలికాలం ప్రభావం కూడా వీటిపై ఉందని అధికారులు చెబుతున్నారు.
గ్రామాలకు 3 వేల బస్సులు
ప్రస్తుతం అత్యధికంగా మూడు వేల వరకు పల్లెవెలుగు సర్వీసులు నిత్యం నడుస్తున్నాయి. వీటిలో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆర్టీసీ సర్వీసులు పునరిద్ధరించాక మొదట్లో పల్లెవెలుగులో ప్రయాణించే వారి సంఖ్య అతి తక్కువగా ఉండేది. ఓఆర్ 50% వరకే ఉండటంతో సంస్థకు నష్టం వచ్చేది. ఇపుడు వీటిలో 73% సగటు ఓఆర్ వస్తోంది.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు 14 రోజుల్లోనే పూర్తి చేసేలా బిల్లు..!