రాష్ట్రంలో తెలంగాణ మద్యం ఏరులైపారుతోంది. ముఖ్యంగా కృష్ణాజిల్లా నందిగామ సబ్ డివిజన్ పరిధిలోని 7 మండలాల్లో తెలంగాణ మద్యం అక్రమంగా అమ్ముతున్నారు. అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా నందిగామ ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు నాలుగుసార్లు దాడులు నిర్వహించిన పోలీసులు... 650 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కోదాడ, మధిర ప్రాంతాల నుంచి... మద్యం బాటిళ్లను తెలంగాణ ఎక్సైజ్ శాఖ వేసే స్టిక్కర్లను తొలగించి తీసుకొస్తున్నారని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
తక్కువ ధరే కారణమా..!
తెలంగాణ నుంచి రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణాకు... ధర వ్యత్యాసమే కారణమని పోలీసులు తెలిపారు. తెలంగాణ కంటే ఆంధ్రాలో క్వాటర్ బాటిల్‌కు 20 నుంచి 60 రూపాయల వరకు తేడా ఉందని.. ఫుల్ బాటిల్‌కు రూ.200 నుంచి రూ.640 వరకు తేడా ఉంది. అందుకే ఈ తరహా రవాణా జరుగుతోందని పేర్కొన్నారు.
మద్యం అమ్మేందుకు గ్రామాల్లో ఒక్కరిద్దరూ లేదా ముగ్గరు వ్యక్తులతో కలిసి దందా కొనసాగిస్తున్నారని నందిగామ ఎక్సైజ్ సీఐ రాధాకృష్ణ తెలిపారు. గత 15 రోజుల్లో తెలంగాణ నుంచి మద్యం తీసుకొస్తున్న ముగ్గురుతో పాటు గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరుపుతున్న 23 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
తెలంగాణ నుంచి ఏపీకి మద్యం అక్రమ రవాణా కాకుండా... సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తే కఠినంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహారిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : పాత ఫొటోలతో వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోంది: లోకేశ్