మనిషి అవసరాలే ఆవిష్కరణలకు మూలం. ఆ మాట మరోసారి రుజువు చేస్తున్నాడు... ఈ హైదరాబాదీ. ఎదురైన ఆపదల నుంచే... సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాడు. అతివేగం కారణంగా రోడ్లపై ఎందరో ప్రమాదాల బారిన పడుతున్నారు. అందులో ద్విచక్ర వాహనదారులే ఎక్కువ. వారి ప్రాణాలకు రక్షణగా కృత్రిమ మేధ సాంకేతికతో స్మార్ట్ హెల్మెట్ తయారు చేశాడు... ఈథో సీఈవో కృష్ణ మండ.
చదువుల్లో, క్రీడల్లో ముందు...
హైదరాబాద్‌లోని మల్కాజిగిరి గౌతం నగర్‌కు చెందిన ప్రకాష్ రావు, అన్నపూర్ణ కుమారుడు... కృష్ణ మండ. కృష్ణ తండ్రి పోలీస్ శాఖలో అదనపు ఎస్పీ. తల్లి అన్నపూర్ణ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కృష్ణ చిన్నప్పటి నుంచి చదువుల్లో, క్రీడల్లో ముందుండేవాడు. ఈ నేపథ్యంలో.. భవిష్యత్ ప్రణాళికలపై కృష్ణకు.. అతడి కుటుంబం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఫలితంగా, ఐఏఎస్, ఐపీఎస్ అని కాకుండా.. ఇష్టం ఉన్న రంగం వైపు అడుగులు వేశాడు.
ఇంజినీరింగ్ మధ్యలోనే వదిలేసి..
కృష్ణ ఉన్నత విద్య కోసం... అమెరికాకు వెళ్లాడు. ప్రఖ్యాత ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో చేరాడు. కానీ ఎవరికీ సాధ్యం కానీ పనులు చేయాలనే తపన... వినూత్న ఆవిష్కరణలకు నాంది పలకాలని కుతూహలం వెంటాడుతునే ఉండేవి. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ మధ్యలోనే వదిలేసి.. సొంతగా అంకురసంస్థ ప్రారంభించాడు.
15 రోజులు మంచానికే...
నాలుగు చక్రాల వాహనాలు ప్రమాదానికి గురవకుండా ముందుగానే పసిగట్టే పరికరాలు తయారు చేసేందుకు "ఈథో" అనే అంకుర సంస్థ ఏర్పాటు చేశాడు. అంతకుముందు.. 2016లో న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. 15 రోజులు మంచానికే పరిమితం అయ్యాడు. ఆ సమయంలోనే తనకో ఆలోచన వచ్చింది. కార్ల తరహా ప్రత్యేక రక్షణ పరికరాలు ద్విచక్రవాహనాలకు ఉండవు. రియర్ కెమెరాలు, నావిగేషన్ వంటి సదుపాయాలు ఉండవు. ఈ సౌకర్యాలు అన్నింటిని ద్విచక్ర వాహనదారులకు అందిచడమే లక్ష్యంగా స్మార్ట్ హెల్మెట్ తయారు చేశాడు.
భారత్‌లోనూ విడుదలకు ప్రణాళికలు
కృత్రిమ మేధ సాంకేతికతో పనిచేసే స్మార్ట్ హెల్మెట్.. రియర్ వ్యూ కెమెరా, కాల్ వాయిస్ ఆధారంగా వాహనదారునికి సమాచారం ఇస్తుంది. ఎదురుగా వచ్చే మలుపులు, వాహనాలు, అకస్మాత్తుగా తలెత్తే ప్రమాదాల నుంచి వాహనదారున్ని ముందుగానే హెచ్చరిస్తుంది. స్మార్ట్ హెల్మెట్ అందుబాటులోకి తెచ్చేందుకు కృష్ణకు మూడేళ్లు పట్టింది. మెుదట న్యూయార్క్‌లో విడుదల చేసి... ఆ తరువాత అందుబాటు ధరల్లో భారత్‌లోనూ విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ ఆవిష్కరణ వల్ల కృష్ణ ఒక్కడికే కాదు... ఎన్నో కుటుంబాలకు మేలు చేకూరుతుందని కృష్ణ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఫోర్బ్స్ అండర్ -30 జాబితాలో స్థానం
ప్రజా ప్రయోజనం ఉన్న ఈ వినూత్న ఆవిష్కరణ గ్లోబల్ గుర్తింపు పొందటమే కాక, ఫోర్బ్ అండర్ -30 జాబితాలో కృష్ణ మండకు స్థానం దక్కేలా చేసింది. స్మార్ట్ హెల్మెట్ పేటెంట్ హక్కులు పొందిన కృష్ణ... త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు కృషి చేస్తున్నాడు.
ఇదీ చదవండి: