హైదరాబాద్లో మళ్లీ లాక్‌డౌన్ తప్పదంటూ వస్తున్న వార్తలు మద్యం అమ్మకాలను అమాంతం పెంచేశాయి. ముందు జాగ్రత్తగా మద్యపాన ప్రియులు భారీగా కొనుగోళ్లకు వెంపర్లాడారు. ఫలితంగా ఒక్క సోమవారమే రెట్టింపు స్థాయిలో అమ్మకాలు సాగాయి. అకస్మాత్తుగా లాక్‌డౌన్ విధించటంతో మార్చి 22 నుంచి మిగతా వ్యాపారాలతో పాటు మద్యం దుకాణాలూ మూతపడిన సంగతి తెలిసిందే. దాదాపు నెలన్నర మద్యం దొరక్క మందుబాబులు అల్లాడిపోయారు.
లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 6 నుంచి రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతించింది. ఒక్కసారిగా అవసరార్థులంతా మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. ఒకటి రెండు రోజులు భారీగానే అమ్మకాలు సాగినా జనం వద్ద పెద్దగా డబ్బు లేకపోవడం, వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, ఇంకా చాలా పరిశ్రమలు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవటంతో మద్యం అమ్మకాలు క్రమంగా నెమ్మదించాయి.
ప్రస్తుతం భాగ్యనగరంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నందున లాక్ డౌన్ తప్పదనే వార్తలు వస్తున్నాయి. దీంతో మందు బాబులు అప్రమత్తమయ్యారు. లాక్ డౌన్ విధిస్తే మందు దొరకడం కష్టం కనుక ఒక్కసారే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారు. సోమవారం ఒక్కరోజే నగరంలో రెట్టింపు కొనుగోళ్లు జరిగాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: