Hybiz Media Awards: సామాజిక మాధ్యమాలు ప్రధాన ప్రసార మాధ్యమంతో పోటీ పడుతున్నప్పటికీ ఒక్కోసారి పరిమితులు దాటి వ్యవహరిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం బాగా పనిచేస్తే మంచిగా చూపించాలి, చేయనప్పుడు చీల్చి చెండాడాలని అన్నారు. పాజిటివ్, నిర్మాణాత్మక కథనాలపై ప్రసార మాధ్యమాలు దృష్టి సారించాలని సూచించారు. హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో మంగళవారం మీడియా అవార్డ్స్-2022 పేరిట ఉత్తమ సేవలందిస్తున్న పాత్రికేయులకు, ప్రకటనల విభాగంలో పనిచేస్తున్న పలువురికి పురస్కారాలు అందజేశారు. హైదరాబాద్ మాదాపూర్ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేటీఆర్.. వివిధ పత్రికలు, ఛానెళ్లకు చెందిన 74 మంది ప్రతినిధులకు అవార్డులు బహూకరించారు.
ఆలిండియా రేడియోలో న్యూస్ ప్రజెంటర్లుగా పనిచేస్తున్న ఇలియాస్ అహ్మద్, జ్యోత్స్న, సాక్షి గ్రూప్ డైరెక్టర్ కేఆర్‌పీ రెడ్డిలకు మీడియా లెజెండరీ అవార్డులు ప్రదానం చేశారు. ప్రత్యేక కేటగిరీ కింద ‘ఈనాడు’లో ప్రచురితమవుతున్న ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం’ కథనాలకు పురస్కారం ప్రకటించారు. దీనిని ‘ఈనాడు’ సీనియర్ పాత్రికేయుడు బొజ్జ ఎల్లయ్య స్వీకరించారు. బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డును విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్య అందుకున్నారు. కార్యక్రమంలో ‘ఈనాడు’ డైరెక్టర్ ఐ.వెంకట్, హైబిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రాజ్‌గోపాల్, సీఈవో సంధ్యారాణి, నిహిలెంట్ సంస్థ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ కె.వి.శ్రీధర్, భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాం.. ఆదుకోండి'.. ప్రధాని మోదీకి జగన్ వినతి