తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. గత ఆరు నెలలుగా సాగుతున్న ప్రచారానికి బ్రేక్ పడింది. మైక్‌లు బంద్ అయ్యాయి. ఎన్నికల 72 గంటల ముందు ప్రచారం ముగించాలన్న ఈసీ ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముగించాయి. రాత్రి 7 తర్వాత స్థానికేతరులు హుజూరాబాద్‌లో ఉండొద్దని ఈసీవో స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలను ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్‌లు సవాల్‌గా స్వీకరించాయి. బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ గెల్లు శ్రీనివాస్‌యాదవ్(తెరాస), ఈటల రాజేందర్(భాజపా), బల్మూరి వెంకట్(కాంగ్రెస్)ల తరఫున మూడు పార్టీలు ప్రచారంలో నువ్వా-నేనా అనే తరహాలో పోటీ పడ్డాయి. ఓటర్ల మన్ననల్ని పొందేందుకు చెమటోడ్చాయి. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2 న ఓట్లను లెక్కించనున్నారు.
ఊపందుకున్న ప్రలోభాలు..
పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంతో పాటు ప్రలోభాలు ఊపందుకున్నాయి. డబ్బులతో కూడిన కవర్లు కలకలం రేపుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు డబ్బులతో కూడిన కవర్లు ఓటర్ల చెంతకు చేరుతున్నాయి. వాటిని అందుకున్న ఓటర్లు... కవర్లలో ఉన్న డబ్బు చూసి అవాక్కవుతున్నారు. ఒక్కో కవర్లో రూ.6వేల నుంచి రూ.10 వేల వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వంద మందికి ఒక స్థానిక నాయకుడిని అప్పజెప్పినట్లుగా పేర్కొన్నారు. పైగా డబ్బులు ఉన్న కవర్లపై నంబర్లు వేసి ఉండడం గమనార్హం. ఒకటో నంబర్ ఉంటే ఒకరికి, రెండో నంబర్ ఉంటే ఇద్దరికీ డబ్బులు అని ఓటర్లు అంటున్నారు. నేటితో ప్రచార ఘట్టం ముగియనున్న నేపథ్యంలో... తెరమీదకు వచ్చిన కవర్ల పంపిణీ చర్చనీయాంశంగా మారింది.
తెరవెనుక మంత్రాంగం!
ఇప్పటివరకు ప్రచారంలో ప్రత్యక్షంగా ఓటర్లను మెప్పించిన పార్టీలు ఇకపై తెరవెనుక మంత్రాంగానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే మద్యం సీసాలను పలుచోట్ల పంపిణీ చేశారనే ప్రచారం వినిపిస్తోంది. దసరా పర్వదినం సందర్భంగా ఆయా పార్టీలవారు మాంసంతోపాటు మద్యాన్ని విరివిగా పంచారని అంటున్నారు. పోలింగ్‌కు ముందు 28, 29 తేదీల్లో లోలోపల జరిగే ప్రచారం అభ్యర్థుల గెలుపు ఓటముల్ని ప్రభావితం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్నాళ్లుగా అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలకు భిన్నంగా తాయిలాలు, ప్రలోభాలపర్వం అధికంగా కనిపించే వీలుంది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా నియోజకవర్గంపై దృష్టి సారిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామావళిని ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకునేలా ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయి.
- ఓటర్ల సంఖ్య: 2,36,283
- పురుష ఓటర్లు: 1,18,720
- మహిళా ఓటర్లు: 1,17,563
- పోలింగ్ కేంద్రాలు : 306