తెలంగాణలోని హుస్నాబాద్ మండల కేంద్రంలోని శివారులో ఉన్న పంటపొలాల్లో రైతులు మొక్కజొన్నతో పాటు వివిధ కాయగూరలు పండిస్తున్నారు. పంటలపై వానర సైన్యం దండెత్తి... పంటలను పాడుచేస్తోంది. కోతుల నుంచి పంటను కాపాడుకునేందుకు.. బాంబులు, డబ్బులు కొట్టటం, చీరలు కట్టటమే కాకుండా.. రోజంతా కావలి కాయటం లాంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు. ఎన్ని చేసినా.. ఫలితం మాత్రం తాత్కాలికంగానే కన్పిస్తోంది. తర్వాత మళ్లీ ఎప్పటిలాగే.. దండయాత్రను ఎదుర్కోవాల్సి వస్తోంది.
తలో రూపాయి వేసుకుని...
కోతులను భయపెట్టేందుకు కొండముచ్చులు ఒక్కటే మార్గం. వాటిని కొనటం తలకు మించిన భారమని భావించిన రైతులు... చాకచక్యంగా వ్యవహరించారు. అందరు కలిసి తలో రూపాయి వేసుకున్నారు. పోగైన డబ్బుతో... కొండముచ్చుల ఫొటోలతో ఫ్లెక్సీలు వేయించారు. పొలాల్లో అక్కడక్కడా ఆ ఫ్లెక్సీలను కట్టారు. వీటిని చూసిన కోతులు... నిజంగానే కొండముచ్చులున్నాయని భ్రమపడి.. భయంతో అటువైపు చూడటమే మానేశాయి. ఫ్లెక్సీల ప్లాన్ ఇచ్చిన ఫలితంతో.. కోతుల బెడద నుంచి ఇప్పటివరకైతే కొంత ఉపశమనం దొరికిందని రైతులు చెబుతున్నారు.
- కాస్త ఉపశమనం దొరికింది...
"మాకు రెండెకరాల పొలం ఉంది. మొక్కజొన్న వేశినం. ఇప్పుడిప్పుడే కాత పడుతున్న పంటను కోతులు నాశనం చేస్తున్నాయి. కోతుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల.. బాంబులు, డప్పు చప్పుళ్లు, చీరలు కట్టటం లాంటి ప్రయత్నాలతో ఎలాంటి ఉపయోగం కన్పించలేదు. మేమే స్వయంగా పంటల దగ్గర కాపాలా ఉన్న లాభం లేకుండా పోతోంది. మా మీదికి కోతులు దాడికి వస్తున్నాయి. ఇవన్నీ కాదని... మనిషికో రూపాయి వేసుకుని... కొండెంగల ఫొటోలతో ఫ్లెక్సీలు కొట్టిచ్చినం. పొలాల్లో అక్కడక్కడా కట్టినం. ఈ రెండుమూడు రోజుల నుంచైతే... కోతుల బెడద నుంచి కాస్త ఉపశమనం దొరికింది."
- రైతులు
శాశ్వత చర్యలకు విజ్ఞప్తి
ఎన్ని ప్రయత్నాలు చేసినా... అవి తాత్కాలిక ఉపశమనమే ఇస్తున్నాయని రైతులు వాపోతున్నారు. అధికారులే చొరవ తీసుకుని శాశ్వత పరిష్కారం ఆలోచించాలని కోరుతున్నారు. కోతులను కట్టడి చేసే చర్యలు తీసుకుని... పంటలను కాపాడాలని కర్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.