రాష్ట్రంలో వేగంగా ఇళ్లనిర్మాణ ప్రక్రియను చేపట్టినట్లు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణ కార్యక్రమంపై మంత్రులు బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కలిసి శాసనసభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. శాసనసభ్యుల నుంచి క్షేత్రస్థాయిలో వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నామన్నారు. 12 వేల కోట్ల వ్యయంతో పేదల ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం భూములు సేకరించిందని మంత్రి వివరించారు. 30 వేల ఎకరాలు పేదలకు ఇళ్లపట్టాలుగా పంపిణీ చేశామన్నారు. వాటిని లే అవుట్లుగా అభివృద్ధి చేసి సదుపాయాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కేంద్రం మంజూరు చేసిన ప్రతి నాలుగు ఇళ్లలోనూ ఒకటి ఏపీకే మంజూరవుతోందన్నారు.
30 లక్షల లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే సిమెంటు, ఇనుము అందేలా చూస్తున్నామన్నారు. 1 లక్షా 80 వేల గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వ సహకారాన్ని అందిస్తున్నామని తెలిపారు. గతంలో 240 చదరపు అడుగుల ఇల్లు మాత్రమే ఇస్తే.. ఇప్పుడు 340 చదరపు అడుగుల్లో ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 32 వేల కోట్లతో డ్రైనేజీ, రహదారులు, విద్యుత్ లాంటి ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17,005 కొత్త కాలనీలు నిర్మితమవతున్నాయని మంత్రి చెరుకువాడ స్పష్టం చేశారు.
'టిడ్కో ఇళ్ల రివర్స్ టెండరింగ్‌తో రూ.480 కోట్లు పొదుపు'
టిడ్కో ఇళ్ల రివర్స్ టెండరింగ్‌తో రూ.480 కోట్లు పొదుపు చేసినట్లు మంత్రి బొత్స స్పష్టం చేశారు. పేదలకు 2.62 లక్షల ఇళ్లు కట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 90 వేల ఇళ్లకు మౌలిక సదుపాయాలు 100 రోజుల్లోనే కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మిగతా ఇళ్లను ఏడాదిలో పూర్తి చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం 4.5 లక్షల ఇళ్లకు ఉత్తర్వులు ఇచ్చిందని..,కేవలం 51, 616 ఇళ్లే నిర్మించిందని బొత్స వ్యాఖ్యనించారు.
ఇదీ చదవండి
World tigers day: 'పులుల సంరక్షణ చర్యలను పటిష్టంగా కొనసాగించాలి'