కరోనా పాజిటివ్ కేసులు.. రోజురోజుకూ వేగంగా పెరుగుతున్నాయి. ఆసుపత్రులు బాధితులతో నిండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కువ మంది హోం ఐసోలేషన్‌కు మొగ్గు చూపుతున్నారు. పాజిటివ్ అని తెలియగానే హోం ఐసోలేషన్‌లో ఉంటామని చెబుతున్నారు. కొంతమంది వైద్యుల సలహాలు తీసుకుంటున్నారు. మరికొందరు సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఉపశమనం లభించగానే కుటుంబ సభ్యులతో కలిసిపోతున్నారు. దీనివల్ల వైరస్ మిగతా కుటుంబ సభ్యులకు సోకుతోందని వైద్య శాఖ సర్వేలో తేలింది. సొంత వైద్యం చేసుకుని.. పరిస్థితి చేదాటిన తర్వాత ఆసుపత్రులకు వస్తున్నారని కొన్ని ఘటనల్లో తేలింది.
కొవిడ్ పాజిటివ్ అని తేలగానే బాధితుడ్ని ట్రై యేజ్ కేంద్రానికి తీసుకువచ్చి పరీక్షించాలి. అతనికి ఆక్సిజన్ శాతం, ECG, ఎక్స్ రే, హార్ట్ బీట్ పరీక్షించిన తర్వాత హోం ఐసోలేషన్ కు పంపాలా ? లేదా ? అని నిర్ణయించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్ లక్షణాలు తక్కువగా ఉండి ఆక్సిజన్ శాతం 94 కంటే ఎక్కువగా ఉంటే హోం ఐసోలేషన్ లో ఉంచవచ్చని వైద్యులు చెపుతున్నారు. వైద్యులు ఫోన్ ద్వారా, వీడియో కాల్ ద్వారా బాధితులతో నిత్యం మాట్లాడి వైద్య చికిత్స అందిస్తారని తెలిపారు.
హోం ఐసోలేషన్ ఉండే వారు ప్రతిరోజూ జ్వరం, ఆక్సిజన్ శాతం పరీక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆక్సిజన్ శాతం 94 శాతం కంటే తక్కువ ఉన్నా... కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నా వెంటనే ఆసుపత్రిలో చేరాలని చెబుతున్నారు.