తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్దం ఘటనపై అంతర్వేదిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతర్వేదిలో హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఘటనాస్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన మంత్రులపై హిందూ సంస్థలు మండిపడ్డాయి. మంత్రులను ఘటనపై నిలదీశారు. ఈ క్రమంలో పోలీసులు, విహెచ్పీ, భజరంగదళ్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. బారికేడ్లను తోసుకుంటూ వీహెచ్‌పీ, భజరంగదళ్ సభ్యులు తమ నిరసనను వ్యక్తం చేశారు. రథం దగ్ధం వెనక కుట్ర ఉందని ఆరోపించారు.
రథం దగ్ధం ఘటనపై దర్యాప్తు వేగవంతంగా సాగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని డీజీపీని ఆదేశించినట్లు తెలిపారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఘటనాప్రాంతాన్ని పరిశీలించారు. వచ్చే కల్యాణోత్సవం నాటికి నూతన రథం తయారు చేస్తామని వారు హామీ ఇచ్చారు. ముగ్గురు మంత్రులు కలిసి దీనిపై సీఎం జగన్కు నివేదిక అందించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: సరిహద్దుల్లో కాల్పులపై భారత్- చైనా మాటల యుద్ధం