High Court on PIL: ప్రజాహిత వ్యాజ్యం (పిల్) పేరుతో కొందరు న్యాయ విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని హైకోర్టు మండిపడింది. కొన్ని పిల్స్ దాఖలు వెనుక రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, మధ్యవర్తులు ఉంటున్నారని, డబ్బులు పెట్టుబడిగా పెడుతున్నారని తీవ్రంగా ఆక్షేపించింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం మర్రిపూడి గ్రామ పరిధిలో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంటు ఏర్పాటును సవాలు చేస్తూ జి.కొత్తూరుకు చెందిన సుధాకర్, మరో ఇద్దరు పిల్ వేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులులతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
కాలుష్య నియంత్రణ మండలి తరఫు న్యాయవాది వి.సురేంద్రరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇదే వ్యవహారంపై హైకోర్టులో దాఖలైన మరో వ్యాజ్యంలో న్యాయమూర్తి జోక్యం చేసుకోవడానికి నిరాకరించినట్లు సమాచారం ఉన్నప్పటికీ.. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి పిటిషనర్లు ధర్మాసనం ముందు పిల్ వేశారని తెలిపారు. హైకోర్టు స్పందిస్తూ.. ఈ పిల్ దాఖలు వెనుక పెద్దలు ఉన్నట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. నిరర్థక పిల్స్ వేసి కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్న వారికి ఓ సందేశం పంపాలని నిర్ణయించామని వ్యాఖ్యానించింది. ఈ పిటిషనర్లకు తగిన రుసుములు విధిస్తామని స్పష్టం చేసి విచారణను వాయిదా వేసింది.
ఇవీ చదవండి: