నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఆ తర్వాతే ఠాణాకు తీసుకెళ్లేలా ఆదేశించాలని, దీంతో పోలీసు చిత్రహింసలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర డీజీపీ, ఏపీ వైద్య మండలి చైర్మన్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
పౌరుల అరెస్ట్, రిమాండ్ తదితర విషయాల్లో పోలీసులు, కొంతమంది మేజిస్ట్రేట్లు చట్ట నిబంధనలను పాటించడం లేదంటూ.. హిందూ జనశక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు కాకుమాను లలిత కుమార్ హైకోర్టులో ప్రజాహిత వ్యాఖ్యం దాఖలు చేశారు. పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర వాదనలు వినిపిస్తూ... అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటలకు మించి నిర్బంధించకూడదని, పోలీసులు ఆ సమాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
అరెస్ట్ చేసిన వ్యక్తులను సాధ్యమైనంత త్వరగా మెజిస్ట్రేట్ల ముందు హాజరుపరిచేలా ఆదేశించాలని కోరారు. అరెస్ట్ చేసిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆ తర్వాతే ఠాణాలకు తరలించాలన్నారు. దీంతో.. పోలీసు కస్టడీలో చిత్రహింసలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఇటీవల వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, తెదేపా నేత నాదేళ్ల బ్రహ్మం పోలీసుల చేతులో దెబ్బలు తిన్నారని, తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పోలీసు హింసకు భయపడి ఆరెస్టుకు ముందు శరీరాన్ని మీడియాకు చూపించే పరిస్థితి కల్పించారని ఉదహరించారు.
నిందితులను.. మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్కు ఇవ్వకుండా ఆదేశించాలన్నారు. వైద్య పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోయినా, పోలీసులు తనను కొట్టారని నిందితులు పేర్కొన్నా.. ఇకపై వారిని పోలీసు కస్టడీకి ఇవ్వకుండా మెజిస్ట్రేట్లకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ద్వారా తగిన సూచనలు చేసేలా ఆదేశించాలన్నారు. నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యులపైనా చట్ట నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసు కస్టడీలో చిత్రహింసలకు ప్రేరేపించిన వారిపై, ఘటనకు పాల్పడ్డ పోలీసు అధికారులపై తక్షణం క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా సీఎస్, డీజీపీని ఆదేశించాలని కోరారు.
ఇదీ చదవండి: