కొవిడ్ మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టుతో పాటు, దిగువ న్యాయస్థానాలు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులన్నింటినీ బేషరతుగా నెల రోజులు పొడిగిస్తూ సుమోటోగా నమోదు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్రా , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కొవిడ్ మూడో దశ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టుతో పాటు, రాష్ట్రంలోని కింది కోర్టులు, ట్రైబ్యునళ్లు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు ఉత్తర్వులను పొడిగించే నిమిత్తం హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపింది. మొదటి, రెండో దశ వ్యాప్తిలోనూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కక్షిదారులు మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించడం కష్టంగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు న్యాయస్థానాల్లో విచారణలు ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో జరుగుతున్నాయని తెలిపింది. కింది కోర్టుల్లో సాక్షుల విచారణలను నిలిపివేసినట్లు పేర్కొంది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఈనెల 19 నుంచి నెల రోజులపాటు పొడిగిస్తున్నట్లు స్పష్టంచేసింది.
ఇదీ చదవండి: AP News: ఉపాధ్యాయ సంఘాల నేతలకు ముందస్తు నోటీసులు జారీ చేసిన పోలీసులు