తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో భూసేకరణ, పునరావాస అథారిటీలకు ప్రిసైడింగ్ అధికారులను నియమించడంలో చోటు చేసుకున్న జాప్యాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
న్యాయవాది పిల్ దాఖలు
భూసేకరణ, పునరావాస అథారిటీలకు ప్రిసైడింగ్ ఆఫీసర్లను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన న్యాయవాది పి.మల్లిఖార్జునరావు హైకోర్టులో పిల్ వేశారు. న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. ఏడాది కాలంగా ప్రిసైడింగ్ అధికారుల నియామకం జరగలేదన్నారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అథారిటీల్లోని ఉద్యోగులు కొనసాగుతున్నారని.. దీంతో ప్రజాధనం వృథా అవుతోందన్నారు. అధికారులను నియమించడంలో జాప్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ధర్నాసనాన్ని కోరారు.
ప్రభుత్వ అడ్వకేట్ వివరణ
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. విశాఖపట్నంలోని అథారిటీ అధికారిని నియమించినట్టు కోర్టుకు తెలిపారు. మిగిలిన రెండు చోట్ల ప్రక్రియ జరుగుతోందన్నారు. మూడు వారాల్లో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. నియామకానికి సంబంధించిన విధివిధానాలు, పురోగతిపై వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి: 'కొత్తగా నోటిఫికేషన్ ఇస్తేనే ప్రజాస్వామ్యాన్ని బతికించినట్లవుతుంది'