HC On Chintamani Drama: చింతామణి నాటకాన్ని ప్రభుత్వం నిషేధించడాన్ని నవాలు చేస్తూ.. పిల్ దాఖలు చేసినందుకు బెదిరింపు ధోరణితో ఏపీ ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కుప్పం ప్రసాద్.. మీడియాతో మాట్లాడారని ఎంపీ రఘురామ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిల్ ఉపసంహరించుకోకపోతే తోలు వలిచేస్తామని హెచ్చరించారన్నారు. ప్రసాద్‌ను వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ అనుబంద పిటిషన్ చేశామన్నారు. ప్రధాన వ్యాజ్యం 8న విచారణకు రావాల్సి ఉండగా.. జాబితాలో లేదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని విచారణ జరపాలని కోర్టు ప్రారంభ సమయంలో ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఆ అభ్యర్థనపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ కె.మన్మథరావుతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. బుధవారం విచారణకు వచ్చేలా చూస్తామని తెలిపింది.
మరోవైపు ఎంపీ రఘురామ వేసిన పిల్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం వద్ద బుధవారం నాటి విచారణ జాబితాలోకి వచ్చింది. ఎంపీ రఘురామ వేసిన వ్యాఖ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు ఏ వివరాల ఆధారంగా నిషేధం విధించారు.. అందుకు సంబంధించిన దస్త్రాలను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యంలో తమను ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు చెప్పుకునే అనుమతివ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి . శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవీ ఆర్యవైశ్య వృద్ధాశ్రమ, నిత్యాన్న సత్రానికి సంబంధించిన కోఆర్డినేటర్ జె.చంద్రశేఖర్.. ఈ పిటిషన్ వేశారు.
చింతామణిలో సుబ్బిశెట్టి పాత్ర ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని సూచిస్తోందని అనుబంధ పిటిషన్లో పేర్కొన్నారు. సుబ్బిశెట్టి వేశ్యాగృహానికి కస్టమర్‌గా చూపుతుందని.. నాటకంలో ఆ పాత్ర ఆర్యవైశ్యుల సామాజిక, నైతిక వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వినతి సమర్పించగా.. నాటకంపై నిషేధాన్ని విధించిందన్నారు. నిషేధం విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఏపీ విభాగ్ అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు మరో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. వివిధ అసోసియేషన్ల వినతులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించిందన్నారు. కాళ్లకూరి నారాయణ ప్రజలను సంస్కరించేలా సామాజిక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో చింతామణి నాటకాన్ని రచించారన్నారు. అందుకు భిన్నంగా అనుచిత వ్యాఖ్యలు జోడించి నాటకాన్ని అసభ్యకరంగా.. అశ్లీలంగా ప్రదర్శిస్తున్నారన్నారు. 30 లక్షల మంది వైశ్యుల ప్రయోజనాలను కాపాడాలని.. నకిలీ చింతామణి నాటకాన్ని నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.
ఇదీ చదవండి: GVL Narasimha Rao: త్వరలో కొలిక్కి రానున్న విశాఖ రైల్వే జోన్: జీవీఎల్