High Court on Amul Parlours: ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటిన్ ఫెడరేషన్ ఆస్తులను అమూల్‌కు అప్పగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మానం, అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని సవాలు చేస్తూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంతో ప్రస్తుత పిల్‌ను కలిపి విచారణ చేస్తామని స్పష్టంచేసింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అయితే కంటెయినర్ బూత్లు ఏర్పాటు చేసుకోవచ్చుకాని.. వాటిలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించొద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిన్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు అదే శాలిచ్చింది.
నగరపాలక సంస్థకు రావాల్సిన ఆదాయంలో కోతలు: విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అమూల్ సంస్థకు నామినేషన్ ఆధారంగా, బహిరంగ కంటెయినర్ బూత్ల ఏర్పాటుకు ఈ ఏడాది ఫిబ్రవరి 9న వీఎంసీ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని కోరుతూ.. 13వ వార్డు కార్పొరేటర్ బాలస్వామి హైకోర్టులో పిల్ వేశారు. తాజాగా జరిగిన విచారణలో సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. ఇప్పటికే 45 పార్లర్ల ఏర్పాటుకు ప్రాంతాల్ని గుర్తించారన్నారు. ఆయా ప్రాంతంలోని మార్కెట్ విలువలో 10 శాతం సొమ్ము చెల్లించేందుకు వీలు కల్పిస్తూ మూడేళ్ల వరకు లీజుకిచ్చారన్నారు. స్థలాల్ని లీజుకు ఇవ్వడంలో 90 శాతం అమూల్‌కు రాయితీ కల్పించారన్నారు. దీంతో నగరపాలక సంస్థకు రావాల్సిన ఆదాయంలో కోతపడుతుందన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ అధ్వర్యంలోని విజయ డెయిరీ ప్రైవేట్ స్థలాలను తీసుకొని పార్లర్లు నిర్వహిస్తోందన్నారు. పాల వ్యాపారం చేసే పలు సహకార సంఘాలు ఉన్నప్పటికీ.. వాటిని ప్రభుత్వం ప్రోత్సహించడం లేదన్నారు. అమూల్‌కు మాత్రమే భారీగా రాయితీ ఇస్తోందన్నారు.
మహిళా సాధికారిత కోసం అమూల్ పార్లర్లకు అనుమతి: పాల ఉత్పత్తిదారులైన మహిళా సాధికారిత కోసం అమూల్‌కు కంటెయినర్ల ఏర్పాటుకు అనుమతిచ్చామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. 90 శాతం రాయితీతో స్థలాలను లీజుకు ఇచ్చామనన్నారు. ప్రస్తుత భూమి మార్కెట్ విలువలో 10 శాతం సొమ్ము లీజుగా చెల్లించేలా నిర్ణయించామన్నారు. బోర్డ స్టాండింగ్ ఆర్డర్‌కు అనుగుణంగా వ్యవహారించామన్నారు. అమూల్- రాష్ట్ర ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందాన్ని సవాల్ చేస్తూ.. గతంలో ఓ పిల్ దాఖలైందని గుర్తుచేశారు. దానితో కలిసి ప్రస్తుత వ్యాజ్యాన్ని విచారించాలన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది. అయితే కంటెయినర్ బూత్లు ఏర్పాటు చేసుకోవచ్చుకాని.. వాటిలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించొద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఇదీ చదవండి: పీఆర్సీ సంతృప్తిగా లేకపోయినా.. సర్దుకు పోయాం: సూర్యనారాయణ