పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్ల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టపగలు హైకోర్టు న్యాయవాది దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. పెట్రోల్ పంపు ఎదుట విచక్షణారహితంగా దుండగులు దాడి చేశారు. న్యాయవాదులు వామన్‌రావు, ఆయన భార్య నాగమణిపై కత్తులతో విరుచుకుపడ్డారు. మంథనిలో కోర్టుకు హాజరై.. తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా దుండగులు వాహనాన్ని అడ్డుకున్నారు. పథకం ప్రకారం కారు ఆపగానే విచక్షణారహితంగా దాడిచేశారు. కారులో కూర్చున్న న్యాయవాద దంపతులపై కత్తులతో దాడికి దిగారు.
చివరిగా కుంట శ్రీను పేరు..
తీవ్రంగా గాయపడిన న్యాయవాది వామన్‌రావు రోడ్డుపై రక్తపు మడుగులో పడిపోయాడు. పక్కనే వాహనదారులు వెళ్తున్నా స్పందించలేదు. అతని భార్య నాగమణి కారులోనే విలవిల్లాడారు. రక్తపు గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దుండగుల దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారు సీట్లో ఉన్న పత్రాలు రక్తంతో తడిసిపోయాయి. రహదారిపై రక్తపు మడుగులో పడి ఉన్న న్యాయవాది వామన్‌రావు.. కుంటశ్రీను పేరును ప్రస్తావించారు. కుంట శ్రీను తెరాస మంథని మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
మార్గం మధ్యలోనే మృతి..
కత్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను పెద్దపల్లి ఆస్పత్రికి తరలించగా మార్గంమధ్యలోనే మృతి చెందారు. పెద్దపల్లి జిల్లాలో పట్టపగలు జరిగిన ఈ దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. దుండగుల కోసం పోలీసుల విస్తృతంగా గాలిస్తున్నారు. అన్ని చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు జరుపుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన డీసీపీ రవీందర్.. దాడి వివరాలు సేకరించారు.
శీలం రంగయ్య లాకప్‌డెత్ కేసులో..
వామన్‌రావు, శ్రీనివాస్‌ల స్వస్థలం మంథని మండలం గుంజెపడుగు. శీలం రంగయ్య లాకప్‌డెత్ కేసును వామన్‌రావు వాదించారు. భూ ఆక్రమణలపై సామాజిక మాధ్యమాల్లో ఆయన స్పందించారు. ఈ నేపథ్యంలో కుంట శ్రీనివాస్, కుమార్‌లపై తమకు అనుమానం ఉన్నట్లు వామన్‌రావు సోదరుడు ఇంద్రశేఖర్ ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
ఆరు ప్రత్యేక టీంలు ఏర్పాటు..
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంథనికి 16 కిలోమీటర్లు దూరంలో మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో హత్య జరిగిందన్నారు. దుండగులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని సీపీ వెల్లడించారు.
అనుబంధ కథనం: