రైతుల ప్రయోజనం కోసం రాష్ట్రంలో 6400 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఇంధన శాఖ, ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రాజెక్టు ఏర్పాటులో జాప్యంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుందన్నారు. 6400 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ల ఏర్పాటు కోసం టెండర్లను ఆహ్వానిస్తూ.. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ జారీచేసిన రొక్వెస్ట్ ఫర్ సెలక్షన్, ముసాయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరారు. బిడ్డింగ్ ప్రక్రియలో విజేతగా నిలిచిన సంస్థల్లో ఒకటైన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. టెండర్ల ప్రక్రియను రద్దు చేయడంలో సింగిల్ జడ్జి పొరపాటు పడ్డారన్నారు. బిడ్డింగ్ ప్రక్రియ నిబంధనల మేరకే జరిగిందన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
వ్యవసాయానికి 6,400 మెగా వాట్ల విద్యుత్ అందించే ఉద్దేశంలో భాగంగా ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పది సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు కోసం ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ గతేడాది నవంబర్‌లో టెండర్లను ఆహ్వానించింది. అందులోని రిక్వెస్ట్ ఫర్ సెలక్షన్, ముసాయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పంద నిబంధనలు కేంద్ర విద్యుత్ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది జనవరి 7న ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. మెగా సౌర విద్యుత్తు ప్రాజెక్ట్ ఏర్పాటు విషయమై బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగించుకోవచ్చని.. అయితే బిల్డింగ్‌లో విజేతగా నిలిచిన కంపెనీలో తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు ఒప్పందాలు చేసుకోవద్దంటూ ఏపీ ప్రభుత్వాన్ని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదనంతరం ఆ వ్యాజ్యంపై లోతైన విచారణ జరిపి ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ జారీ చేసిన రిక్వెస్ట్ ఫర్ సెలక్షన్, ముసాయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేస్తూ.. ఈ ఏడాది జూన్ 17 తీర్పు ఇచ్చారు. ఆర్ఎస్ఎస్, సీఓఏ కేంద్ర విద్యుత్ చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు.
సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ.. ఏపీ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి, విద్యుత్తు పంపిణీ సంస్థలు, టెండర్ ప్రక్రియలో విజేతలుగా నిలిచిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఆదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్ ట్వెల్ లిమిటెడ్, హెచ్ ఈఎస్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. తాజాగా జరిగిన విచారణలో ఇంధన శాఖ తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. టాటా పవర్ సంస్థ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు సమయం పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆ విజ్ఞప్తిని తిరస్కరించడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేయడం కోసం లైసెన్స్ అవసరం లేదు. సోలార్ సంస్థలు ఉత్పత్తి చేసిన విద్యుత్ ను కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా అందిస్తాం. రైతులకు నేరుగా విద్యుత్ ను సరఫరా చేస్తాం కాబట్టి విద్యుత్ చట్టంలోని సెక్షన్ 63 వర్తించదు. బిడ్డింగ్ ప్రక్రియలో ఐదు సంస్థలు విజేతలుగా నిలిచాయి. ప్రక్రియ ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వండి . సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి " అని న్యాయవాదులు కోరారు. ప్రాజెక్ట్ ఏర్పాటులో జాప్యంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుందని పిటీషనర్ తరపు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. టెండర్ల ప్రక్రియను రద్దు చేయడంలో సింగిల్ జడ్జి పొరపాటు పడ్డారన్నారు. బిడ్డింగ్ ప్రక్రియ నిబంధనల మేరకే జరిగిందన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది.
ఇదీ చదవండి.. HC ON MINING: మీరేమో నిద్రపోతుంటారు.. వాళ్లేమో తవ్వేస్తుంటారు: హైకోర్టు