గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన పలువురు పోలీసు ఉన్నతాధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచారని దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఇందుకు సంబంధించి ఆధారాలతో అదనపు సమాచారం సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ ఎన్. జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
పోలీసు అధికారులకు గత కొన్ని నెలలుగా పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచారని పేర్కొంటూ ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన పి. శ్రీనివాసరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ... వేరువేరు కారణాలు చెబుతూ ఇన్స్పెక్టర్ నుంచి ఐపీఎస్ స్థాయి అధికారుల వరకు కొందరు అధికారులను 8 నెలల నుంచి వెయిటింగ్లో ఉంచారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు, విధులు నిర్వహించే అధికారులు అందుబాటులో ఉన్నా వెయిటింగ్లో ఉంచాల్సిన అవసరం ఏముందన్నారు. ఇంటెలిజెన్స్ మాజీ డీజీ వెంకటేశ్వరరావును వెయిటింగ్లో ఉంచి తాజాగా సస్పెండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. వెయిటింగ్లో ఉన్న అధికారుల వివరాలు, ఎప్పటి నుంచి వెయిటింగ్లో ఉన్నారో తెలిపే అదనపు సమాచారం సమర్పించాలని కోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది.
ఇదీ చదవండి: