Government withdraw GO No.59: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన జీవో నంబర్ 59ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. జీవో-59పై హైకోర్టులో దాఖలైన వాజ్యాల విచారణ సందర్భంగా... ఈ రోజు ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. డ్రెస్‌కోడ్ సైతం ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. వీరి సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలో అనే విషమై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
నియామకాలను తప్పుబట్టిన హైకోర్టు...
HC hearing on GO No.59: గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా పనిచేస్తున్న సిబ్బందిని పోలీసు శాఖలో మహిళా పోలీసులుగా నియమించడం చెల్లుబాటు కాదని.. పిటిషనర్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే తమ వాదన వినిపించారు. పిటిషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికంటే ముందు ప్రతివాదులైన ప్రభుత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. శాంతిభద్రత పర్యవేక్షణలో అత్యంత కీలకమైన పోలీసు శాఖలోకి ఇతర మార్గాల ద్వారా నియామకాలు జరపడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దాదాపు 15 వేల మంది సిబ్బంది జీవితాలతో ముడిపడి ఉన్న ఈ వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ముందు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆలోచనలను న్యాయవాది హైకోర్టు ముందు ఉంచుతూ జీవో 59ని ఉసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
వివాదాస్పదంగా జీవో నంబర్-59...
మహిళలపై నేరాలను నియంత్రించడం, బాధితులకు సత్వర సహాయం అందించాలనే ఉద్దేశంతో మహిళా సంరక్షణ కార్యదర్శులు పేరుతో వైకాపా ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. రెవెన్యూశాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు స్థాయిల్లో సుమారు 15 వేల మందిని మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమించారు. పేరుకు రెవెన్యూ శాఖ సంరక్షణ కార్యదర్శులే అయినప్పటికీ... వారికి పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లకు ఉండే అధికారాలు అప్పగించారు. దీంతోపాటు మహిళా సంరక్షకులు అందరినీ మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ఈ ఏడాది జూన్ 23న ప్రభుత్వం జీవో నంబర్ 59ని జారీ చేసింది. ఈ జీవో వివాదాస్పదంగా ఉదంటూ విశాఖపట్నానికి చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఈ ఏడాది అక్టోబరులో కీలక వాదనలు జరిగాయి.
కౌంటర్ దాఖలుకు ఆదేశం...
petitioners to HC: గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షకులుగా పనిచేస్తున్న సిబ్బందిని ఏకంగా పోలీస్ శాఖలో మహిళా పోలీసులుగా నియమించడం చెల్లుబాటు కాదని, పోలీసుల విధులకు రెవెన్యూ కార్యదర్శులు వాడటం తగదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీస్ శాఖలో నియామకాలన్నీ 1859 ఏపీ డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్’ ప్రకారం జరుగుతాయని, మహిళా సంరక్షకులను పోలీసులుగా గుర్తించే ప్రక్రియ ఆ చట్టానికి విరుద్ధమని, సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కూడా ఇది విరుద్దంగా ఉందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్ తరఫు వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. మహిళా పోలీసుల నియామకాల వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోం సెక్రటరీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఏపీపీఎస్సీ చైర్మన్లకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణ వాయిదా
HIGH COURT: ప్రతివాదులు వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలని, వాటిని పరిశీలించిన తర్వాత ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో ఈరోజు మళ్లీ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా... పిటిషనర్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్ తన వాదనలు వినిపించారు. గ్రామ కార్యదర్శులకు కానిస్టేబుళ్లుగా మార్పు చేసి వారికి పోలీసు యూనిఫాం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ జీవో 59ని ఉపసంహరించుకుంటున్నామని వారి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. ప్రభుత్వం పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించి.. కేసు వాయిదా వేసింది.
ఇదీచదవండి.