కొవిడ్ కట్టడి విషయంలో మార్గదర్శకాలను కఠినంగా అమలు చేస్తున్నామని(Covid rules implementation in the state) రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టుకు నివేదించింది. పాజిటివిటి రేటు ప్రస్తుతం 1.10 శాతంగా ఉందని, ప్రభుత్వ చర్యల వల్ల పాజిటివిటి రేటు బాగా తగ్గిందని తెలిపింది. ఆసుపత్రుల్లో చేరే కొవిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిందని వివరించింది. కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన 40.68 లక్షల మంది నుంచి జరిమానా రూపంలో రూ .32.25 కోట్లు వసూలు చేశామని పేర్కొంది. రాష్ట్రంలో టీకా ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని విన్నవించింది. 45 ఏళ్లు పైబడిన వారిలో 71.80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయిందని.. 18-45 మధ్య వయసువారిలో 69.19 శాతం మందికి మొదటి డోసు, 24.19 శాతం మందికి రెండు డోసుల టీకా పూర్తియిందని పేర్కొంది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. కరోనా కేసుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై విచారణను మూసివేస్తామని ప్రతిపాదించింది. కోర్టుకు సహాయకులుగా నియమితులైన అమికస్ క్యూరీ వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. న్యాయస్థానం పర్యవేక్షణ వల్ల రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు మెరుగుపడ్డాయని.. ప్రభుత్వ చర్యలను మరికొంత కాలం పర్యవేక్షించాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం.. విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి..