గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ ల అధికారాలను కొన్నింటిని వీఆర్వోలకు అప్పగించటంపై దాఖలైన పిటిషన్ లపై విచారణ జరిపిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో నెంబర్ -2ను తప్పుపట్టింది. గ్రామ పంచాయతీల పరిపాలన, విధుల్ని ప్రభుత్వం ఆక్రమించిందని చెప్పడంలో సందేహం లేదని తేల్చిచెప్పింది. గ్రామ పంచాయతీలకు సమాంతరంగా గ్రామాల్లో అధికార కేంద్రాల్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిందని పిటిషనర్ చేసిన వాదనల్లో వాస్తవం ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఈ సందర్భంగా.. రాష్ట్రానికి సీఎం ఎంతో.. గ్రామానికి సర్పంచ్ అంతే అని ధర్మాసనం అభిప్రాయపడింది.
సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శులకున్న కొన్ని అధికారాలను గ్రామ రెవెన్యూ అధికారులకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో -2 ను తక్షణం సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శుల అధికారాలను లాగేసుకునేలా ప్రభుత్వం జీవో ఉందని అభిప్రాయం వ్యక్తంచేసింది. గ్రామ సచివాలయాల్లో పరిపాలన సహాయకులపై సర్పంచ్ , కార్యదర్శికి నియంత్రణ లేకుండా జీవో చేస్తోందని స్పష్టం చేసింది. సర్పంచ్ కు నియంత్రణ అధికారం లేకుండా చేయడం 73 వ రాజ్యాగం సవరణ ఉద్దేశానికి విఘాతం కలిగించడమేనని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి చర్యలను అనుమతిస్తే గ్రామ పంచాయతీలు స్వయం ప్రతిపత్తి లేని సంస్థలైపోతాయని తెలిపింది . అధికారులు, ప్రభుత్వం చేతిలో.. పంచాయతీలు , సర్పంచ్ లు కీలుబొమ్మలుగా మారతారని పేర్కొంది. అధికరణ 40, 243 – జీ , ఏపీ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 4 ( 2 ) , రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలు 110 , 149 లకు ఉల్లంఘించేదిగా జీవో నెంబర్ - 2 ఉందని ప్రాథమికంగా హైకోర్టు పేర్కొంది . ప్రతివాదులు కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీచేశారు.
పిటిషనర్ స్పందన..
హైకోర్టు తీర్పు పట్ల పిటిషనర్, గుంటూరు జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే పంచాయతీలకు సరైన నిధులు, విధులు లేక ఇబ్బందులు పడుతున్నామని.. తాజా తీర్పుతో కొంత ఉపశమనం లభించిందని పిటిషనర్ కృష్ణమోహన్ చెప్పారు.
ఇదీ చదవండి: