High Court Green Signal: అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దేశంలో ఎన్నో యాత్రలు, ఆందోళనలు జరుగుతుంటే.. రైతుల పాదయాత్రపైనే ఆంక్షలు ఎందుకని.. పోలీసుల్ని ప్రశ్నించింది. యాత్రకు అనుమతి లేదన్న డీజీపీ ఉత్తర్వులను పక్కకు పెట్టింది. గత పాదయాత్రలో రైతులు కొందరిపై దాడి చేశారని.. యాత్రతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని ఎస్పీలు నివేదికలిచ్చారన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించవచ్చన్న ఉన్నత న్యాయస్థానం.. పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించింది.
ఈ నెల 12 నుంచి నవంబర్ 11 వరకు రాజధాని అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు అడ్డంకులు తొలగాయి. అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు తలపెట్టిన మహాపాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ గురువారం డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. డీజీపీ ఇచ్చే ఉత్తర్వులను తమ ముందుంచాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల చట్టబద్ధతపై మొదటి కేసుగా హైకోర్టు విచారణ జరిపింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించవచ్చని... స్పష్టం చేసింది. 600 మందితో పాదయాత్ర చేసుకోవచ్చని తెలిపింది. పాదయాత్రకు అనుమతి కోసం వెంటనే దరఖాస్తు చేయాలని పిటిషనర్‌కు సూచించింది. దరఖాస్తును స్వీకరించి అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. పాదయాత్ర ముగింపు రోజు మహాసభకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించేందుకు పాదయాత్ర చేసేందుకు ప్రజలకు హక్కు ఉంటుందని.. రాజ్యాంగం ఈ హక్కును కల్పించిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజకీయ పార్టీలు పాదయాత్రకు మద్దతు తెలపకూడదని కూడా ఎక్కడా లేదని కోర్టు అభిప్రాయపడినట్టు న్యాయవాదులు తెలిపారు.
అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు రోజు మహాసభ నిర్వహించాలనుకుంటున్నామని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలుపగా.. ముందస్తుగా స్థానిక పోలీసుల అనుమతి తీసుకుని సభ నిర్వహించుకోవాలని హైకోర్టు సూచించింది.
రైతుల సంతోషం: అమరావతి రైతుల రెండో విడత పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని రైతులు ఘాటుగా స్పందించారు. రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన తమను ప్రభుత్వం మోసం చేసినా.. న్యాయస్థానం అండగా నిలుస్తోందని అన్నారు. మొదటి విడత పాదయాత్ర శాంతియుతంగా జరిగిందని.. అలాగే రెండో విడత మహా పాదయాత్ర ఈ నెల12 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.
ఇవి చదవంఢి: