రాష్ట్రంలో పోలీసులు వ్యక్తుల్ని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలయ్యాక ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయడమో, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడమో చేస్తున్నారు. దీనిపై డీజీపీని కోర్టుకు పిలిపిస్తే ఆయన ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కానీ పోలీసులు హద్దుమీరి వ్యవహరిస్తూనే ఉన్నారు.
హైకోర్టు ఉత్తర్వులపై సామాజిక మాధ్యమాల ద్వారా న్యాయవ్యవస్థపై పలువురు దాడి చేశారు. అందులో అధికార పార్టీ ఎంపీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల హక్కుల్ని రక్షించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా? లేదా? అనేది నిర్ణయించేందుకే ఉత్తర్వులిచ్చాం.
- హైకోర్టు
రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా.. లేదా... అనే అంశంపై విచారణలో హైకోర్టు ధర్మాసనానికి, అడ్వొకేట్ జనరల్‌కు మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా.... లేదా.. అనే విషయాన్ని నిర్ణయిస్తామంటూ ఈ ఏడాది అక్టోబర్ 1న ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఇన్నాళ్లూ దీనిపై ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా.. ఈ దశలో ఇలా కోరడం కేసును సాగదీయడానికేనని వ్యాఖ్యానించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని.. విచారణను వాయిదా వేయాలన్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ అభ్యర్థననూ నిరాకరించింది. సుప్రీంకు వెళితే వెళ్లండి కానీ.. ఇక్కడ విచారణను ఆపేది లేదని తేల్చిచెప్పింది. కోర్టు వాదనపై పోలీసుల తరఫు సీనియర్ న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్ అభ్యంతరం తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైనట్లు తేల్చడమంటే.. అధికరణ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మీ నుంచి ఇటువంటి వాదనలు ఆశించలేదని ఏజీని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించగా.. కోర్టు నుంచి తాను కూడా ఇలాంటి వాదన ఆశించలేదని ఏజీ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయని, వ్యవస్థలు ముఖ్యమని ఏజీని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వ వాదనలు వినేందుకు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పోలీసులు చట్ట ఉల్లంఘనలపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లు, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ వేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 1న విచారణ జరిపిన ధర్మాసనం.. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా? లేదా? అనే విషయాన్ని తేలుస్తామని ఉత్తర్వులిచ్చింది.
మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి వాదనలు వినిపించారు. ‘హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను క్రోడీకరించి అదనపు వివరాల్ని కోర్టుకు సమర్పించాం. రాజధానిని తరలించొద్దంటూ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు పోలీసులు అడ్డంకులు కల్పిస్తున్నారు. కొన్నిచోట్ల అనుమతిచ్చినా.. భద్రత కల్పించడం లేదు. ప్రతిపక్ష పార్టీలు చేపట్టే ర్యాలీలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాల్ని అడ్డుకునేందుకు అధికార పార్టీ వారిని అనుమతిస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా మందడం సమీపంలో చేపడుతున్న కార్యక్రమానికి స్పీకర్లు, బ్యానర్లు, ప్లకార్డుల ప్రదర్శనకు అనుమతిచ్చిన పోలీసులు.. ఏడాది కాలంగా అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులకు ఆంక్షలు విధిస్తున్నారు. ఎందుకీ వివక్ష? మంత్రివర్గ సమావేశాలప్పుడు రైతులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. నిరసన తెలపడం ప్రాథమిక హక్కులో భాగం. నిరసన కార్యక్రమాలకు రాష్ట్రప్రభుత్వం, పోలీసులే భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పోలీసులు ప్రభుత్వం చెప్పినట్లు వ్యవహరిస్తూ.. వ్యక్తుల హక్కుల్ని హరిస్తున్నారు. ప్రజాచైతన్య యాత్రకు అనుమతి తీసుకొని విశాఖ వెళ్లిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు నోటీసు ఇవ్వడంలో బాధ్యులైన పోలీసు కమిషనర్‌పై చర్యలు లేవు. ఏసీపీపై మాత్రమే చర్యలు తీసుకున్నారు. ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల ఉల్లంఘనలు చాలా ఉన్నాయి’ అన్నారు.
న్యాయమూర్తులకు నల్లజెండాలు చూపడమేంటి?
పోలీసుల తరఫు ప్రత్యేక సీనియర్ కౌన్సిల్ ఎస్‌ఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ‘మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ 700 పేజీలతో అదనపు వివరాల్ని సమర్పిస్తూ వాటిని కోర్టు తీసుకోవాలని కోరారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొందుపరిచారు. కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవడంపై అభ్యంతరం లేదు. కానీ అదనపు అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకోవద్దు’ అన్నారు. ఆ వివరాలను ధర్మాసనం నమోదు చేసింది. కోర్టు పరిగణనలోకి తీసుకున్న తీర్పులను చదివి తాను వాదనలు వినిపిస్తానని లేదా కౌంటర్ వేస్తానని సీనియర్ న్యాయవాది అభ్యర్థించగా ధర్మాసనం తోసిపుచ్చింది. మందడం గ్రామ సమీపంలో హైకోర్టుకు వెళ్లే సీడ్ యాక్సెస్ రహదారి పక్కన మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమంలో న్యాయమూర్తులకు నల్లజెండాలు చూపడాన్ని తప్పుపట్టింది. కోర్టుకు వెళ్లి వచ్చేటప్పుడు ఆ విషయాన్ని తాము గమనిస్తున్నామని పేర్కొంది. దీనిపై డీజీపీ, జిల్లా కలెక్టర్‌ను పిలిపించి వివరణ కోరాల్సి ఉన్నా.. స్వీయనియంత్రణ పాటిస్తున్నామని వ్యాఖ్యానించింది.
ఆ ఆదేశాల్ని ఉపసంహరించండి: ఏజీ
ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా? లేదా? అనే అంశాన్ని తేలుస్తామని పేర్కొంటూ అక్టోబర్ 1న ఇచ్చిన ఆదేశాల్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామన్నారు. తమ ముందు లేని అంశాల్ని కోర్టు విచారించజాలదన్నారు. ఆ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘రాష్ట్రంలో వ్యక్తుల్ని పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకుంటున్నారని హైకోర్టులో వ్యాజ్యం దాఖలయ్యాక ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయడమో లేదా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడమో చేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా చూస్తామని డీజీపీ కోర్టుకు హామీ ఇచ్చినా పోలీసులు హద్దుమీరి వ్యవహరిస్తూనే ఉన్నారు. మరోవైపు హైకోర్టు ఉత్తర్వులపై సామాజిక మాధ్యమాల ద్వారా న్యాయవ్యవస్థపై పలువురు దాడి చేశారు. అందులో అధికార పార్టీ ఎంపీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల హక్కుల్ని రక్షించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా? లేదా? అనేది నిర్ణయించేందుకే కోర్టు ఉత్తర్వులిచ్చింది. తర్వాత ఈ వ్యాజ్యాలపై పలుమార్లు విచారణ జరిగింది. అభ్యంతరం ఉంటే మొదట్లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. అప్పుడు వదిలేసి ఇప్పుడు రీకాల్ చేయాలంటూ అనుబంధ పిటిషన్ వేశారు. విచారణను సాగదీయడానికే అనుబంధ పిటిషన్ వేసినట్లుంది. కాబట్టి దానిని తోసిపుచ్చుతున్నాం’ అని ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఏజీ చెప్పారు. ధర్మాసనం స్పందిస్తుండగా.. ఏజీ జోక్యం చేసుకుంటూ తాను చెప్పబోయే అంశం పూర్తి చేయలేదన్నారు. ఆ విషయాన్ని చెప్పొద్దని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ తరహా వాదనలు ఊహించలేదు: ధర్మాసనం
రాష్ట్ర వ్యవహార తీరు ఆధారంగా తాము ఉత్తర్వులు జారీ చేశామని ధర్మాసనం తెలిపింది. మీరు చెప్పింది ఉత్తర్వుల్లో నమోదు చేశామని, అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించొచ్చని పేర్కొంది. తన వాదనలను వినలేదనే విషయాన్ని, విచారణాధికార పరిధిపై తమ అభ్యంతరాన్నీ నమోదు చేయలేదని ఏజీ గుర్తుచేశారు. వాటిని నమోదు చేసేలా కోర్టు నుంచి నిష్పక్షపాతాన్ని కోరుకుంటున్నానన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఏజీ నుంచి ఈ తరహా వాదనలను తాము ఊహించలేదని వ్యాఖ్యానించింది. తానూ అదే చెబుతున్నానని.. ఇలాంటి వ్యవహార శైలిని కోర్టు నుంచి తానూ ఊహించలేదని ఏజీ బదులిచ్చారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ ‘ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.. వ్యవస్థలు స్థిరంగా నిలిచి ఉంటాయి. వ్యవస్థ ఉన్నప్పుడే మీరు ఏజీగా ఉంటారు. న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తారు’ అని వ్యాఖ్యానించింది. వాదనలు చెప్పాలని కోరింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాతే హైకోర్టులో వాదనలు చెప్పేందుకు సహాయపడతామని ఏజీ బదులిచ్చారు. మీరు వాదనలు చెప్పినా చెప్పకపోయినా విచారణను కొనసాగిస్తామని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఆర్టికల్ 356 కింద నివేదిక ఇచ్చినదానితో సమానం
రాజ్యాంగ విచ్ఛిన్నం విషయమై జరిగిన వాదనల్లో తాము ఇన్ని రోజులు పాల్గొన్నామని ఉత్తర్వుల్లో ప్రస్తావించడంపై పోలీసుల తరఫు సీనియర్ న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్ అభ్యంతరం తెలిపారు. రాజకీయ సంక్షోభం, న్యాయవ్యవస్థ అస్థిరత, శాసన వ్యవస్థ విఫలమైనప్పుడు తప్ప.. ఇతర సందర్భాల్లో రాజ్యాంగ విచ్ఛిన్నంగా పరిగణించడానికి వీల్లేదన్నారు. రాజ్యాంగ విచ్ఛిన్నం గురించి నిర్ణయించే విచారణాధికార పరిధి కోర్టుకు లేదన్నారు. రాజ్యాంగ విచ్ఛిన్నమైనట్లు కోర్టు నమోదు చేస్తే.. అధికరణ 356 కింద గవర్నర్ నివేదిక ఇచ్చిన దానితో సమానమని, అది రాష్ట్రపతి పాలనకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి నివేదిక విమర్శలకు దారి తీస్తుందని, కోర్టు ఆ విమర్శల్లోకి రాకూడదని అన్నారు.
ఇదీ చదవండి: