ఉత్తరాంధ్రను కుండపోత వానలు ముంచెత్తాయి. ఉపరితల ఆవర్తన ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలపై ఎక్కువగా ఉండటంతో.. ఈ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం మొదలై రాత్రి 7 గంటల దాకా ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. మూడు, నాలుగు గంటల్లోనే... కొన్నిచోట్ల 10 నుంచి 15 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గరిష్ఠంగా విజయనగరంలో 14.9 సెం.మీ., పూసపాటిరేగ మండలంలోని పాత కొప్పెర్లలో 14.3, డెంకాడలో 14.1, నెల్లిమర్లలో 12 సెం.మీ., శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం, విశాఖపట్నం జిల్లా రాంబిల్లి, కె.కోటపాడు ప్రాంతాల్లో 10 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. విజయనగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొత్తవలస, మెంటాడ తదితర మండలాల్లో వాగులు ఉగ్రరూపం దాల్చాయి. పార్వతీపురం మండలం డోకిశిల ఆశ్రమ పాఠశాల ప్రహరీ కూలిపోయింది. మెంటాడ మండలంలోని కూనేటిగెడ్డ, రాజులగెడ్డ పొంగిపొర్లాయి. చంపావతి నదిలో నీటి ప్రవాహం భారీగా పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని రాజవొమ్మంగిలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దూసరపాములో కొండవాగు, స్థానిక కాలువ కలసి ఉద్ధృతంగా ప్రవహించడంతో సమీప ఇళ్లల్లోకి నీరు చేరి అవస్థలు పడ్డారు.
కర్నూలు జిల్లాలోనూ...
కర్నూలు జిల్లాలో పలు చోట్ల భారీవర్షాలు కురిశాయి. అత్యధికంగా కొత్తపల్లిలో 11.5, ఆత్మకూరులో 11.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం ఆదోనిలో వానలు కురిశాయి. కొత్తపల్లి మండలం శివపురం, ఎ.లింగాపురం రహదారిపై ఎద్దులేరు దాటే సమయంలో.. బైకు సహాఓవ్యక్తి కొట్టుకుపోయారు. చెట్టు మొద్దు పట్టుకుని సురక్షితంగా బయట పడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం రాత్రి పలుచోట్ల వర్షాలు కురిశాయి. రాజమహేంద్రవరంలో సుమారు గంటన్నరపాటు కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలువురు వాహన చోదకులు వాన నీటిలో చిక్కుకొని నానా అవస్థలు పడ్డారు.
అతి భారీ వర్ష సూచన
ఉత్తర, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ‘కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీవర్షాలు కురవొచ్చు. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది’ అని స్టెల్లా వివరించారు.
ఇదీ చదవండి