రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి 30 వరకు దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. రాయలసీమకు కూడా వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో మరోసారి వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.
చిత్తూరు జిల్లాలో అప్రమత్తమైన అధికారులు...
వాతావరణ శాఖ హెచ్చరికలతో చిత్తూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు కాజ్వేలు దాటవద్దని తెలిపారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సిద్దంగా ఉండాలన్న కలెక్టర్.. జిల్లాలో విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.
తమిళనాడులో వర్ష ముప్పు...
తమిళనాడుకు వర్షముప్పు ముంచుకొస్తున్నట్లు వాతావరణ విభాగం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 29న దక్షిణ అండమాన్ సముద్రంమీదుగా అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన వాతావరణం ఉండటంతో దాన్ని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలమీద పడింది. ఇందులో భాగంగా తమిళనాడులో రానున్న 3, 4 రోజుల్లో వర్షప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా 28 జిల్లాలపై ఈ ప్రభావం ఉంటుందని హెచ్చరికలు చేస్తున్నారు. శని, ఆదివారాల్లో 21 జిల్లాలకు భారీవర్షం ముప్పు ఉందని చెప్పగా, ఇందులో తిరువళ్లూరు నుంచి రామనాథపురం మధ్య ఉన్న 13 జిల్లాలు రెడ్‌అలర్ట్ కింద ఉన్నాయి.
ఇదీ చదవండి: