RAINS: అకాల వర్షాలు రైతంగాన్ని, ప్రజలని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత రెండు రోజులుగా పలు చోట్ల కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లా పార్వతిపురం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం వల్ల స్థానికులు అవస్థలు పడుతున్నారు. సంక్రాంతి పండక్కి దూర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి వచ్చే ప్రయాణీకులూ వర్షంతో ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం కావడంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. విశాఖలో కురిసిన భారీ వర్షానికి జిల్లా వాసులు అగచాట్లు పడ్డారు. భారీ వర్షంతో అక్కయ్య పాలెం వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణం అస్తవ్యస్తంగా మారిపోయింది.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు వీధుల గుండా ప్రవహించడంతో.. పండగ సరకులు కోసం పట్టణానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ఆకాల వర్షాలతో అనేక చోట్ల.. కల్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోయింది. ఒంగోలు జిల్లా దర్శిలో కురిసిన వర్షాలతో పొలాల్లోని పైర్లు తడిసిపోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను ఎలా కాపాడుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో గంట పాటు కురిసిన వర్షానికి ప్రధాన రహదారి జలమయమైంది. ధాన్యం కల్లాల్లోనే ఉండిపోవడంతో.. వర్షం కారణంగా నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కురిసిన వర్షాలతోనే తీవ్రంగా నష్టపోయామని.. ఈ వానలతో నిండా మునిగే పరిస్థితి వచ్చిందని వరి, మిర్చిరైతులు వాపోతున్నారు.
3 రోజులపాటు వర్షాలు..
నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి ఉత్తర ఒడిశా వరకు ఈ ద్రోణి విస్తరించినట్లు వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో.. ఉత్తరాంధ్రలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కోస్తా, రాయలసీమలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
ఇదీ చదవండి: