ఓ వైపు కరోనాతో ప్రజలు సతమతమవుతుంటే మరోవైపు రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఊహించని విధంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు పగటి ఉష్ణోగత్రలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఒకేసారి మూడు, నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగటంతో ప్రజలు ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పూట కూడా ఉక్కపోత, వేడిగా ఉంటోంది.
మే మూడో వారం ముగిసే సమయానికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల పైబడి నమోదవుతాయని నిపుణులు అంటున్నారు. రోహిణికార్తె ప్రవేశానికి ఇది 50 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 27-32 డిగ్రీల మధ్య ఉంటాయని అంచనా వేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
వేడి గాలులు ...
మే మూడో వారంలోకి ప్రవేశించటం.. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉష్ణోగ్రతలు బాగా పెరగడానికి కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్, విదర్భ ప్రాంతాల నుంచి ఏటా వేడిగాలులు మే మూడో వారానికి రాష్ట్రాన్ని తాకుతాయి. ఈ ఏడాది కూడా అవి రావడంతో ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి. ఒకవైపు కరోనా మరోవైపు అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో మరికొన్ని రోజులు ప్రజలు ఇంటి పట్టునే ఉంటూ, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి
రాబోవు వారం రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ప్రజలు ఎôడవేడిమికి, ఉష్ణతాపానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు. అధిక ఉష్ణోగ్రతలతో శరీరంలో నీళ్లశాతం తగ్గి డీ హైడ్రేషన్‌కు దారితీస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులను బయటకు రానీయకుండా ఇళ్లల్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు నీళ్లు, మజ్జిగ వంటివి ఎక్కువ తీసుకోవాలి.- ఆచార్య సీహెచ్.సత్యనారాయణ, వాతావరణ విభాగం, కేఎల్ విశ్వవిద్యాలయం
ఇదీ చదవండి :