HIGH COURT: రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పించాలని, అభివృద్ధి చేసిన ప్లాట్లు రైతులకు ఇవ్వాలంటూ మార్చి 3న హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ ఉల్లంఘించాయంటూ దాఖలైన ధిక్కరణ వ్యాజ్యాలపై.. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. రైతుల తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు... కోర్టు తీర్పు మేరకు అధికారులు వ్యవహరించడం లేదన్నారు. కోర్టు తీర్పు అమలుకు ఐదేళ్ల సమయం కావాలని సీఎస్ వేసిన అఫిడవిట్‌లో కోరారని, దానిని వ్యతిరేకిస్తూ తాము కౌంటర్ వేశామని చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత కూడా అమరావతి పనుల్లో పురోగతి లేదన్నారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం.. కొన్ని పనులు ప్రారంభించినట్లు పత్రికల్లో చూశామని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్... పనుల స్థాయీ నివేదికను కోర్టు ముందు ఉంచామన్నారు. తీర్పు అమలుకు సమయం పొడిగించాలని ఇప్పటికే అఫిటవిట్ వేశామన్నారు. ప్రభుత్వం కోరిన విధంగా రాజధాని అభివృద్ధికి సమయం పొడిగిస్తే.. తాము వేసిన వ్యాజ్యాల ఉద్దేశం నెరవేరదని మరో న్యాయవాది ఇంద్రనీల్ బాబు అన్నారు. భూసమీకరణ కింద రైతుల నుంచి భూములు తీసుకొని మూడేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వడంలో విఫలమైనందున... పరిహారం కోరుతూ వ్యాజ్యాలు వేశామని తెలిపారు. వాటిపై విచారణ జరపాలని విన్నవించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం... కౌంటర్లు వేయడం పూర్తయ్యాక అన్నింటినీ కలిపి విచారిస్తామని తెలిపింది.
రాజధానిపై తీర్పును ఉల్లంఘించలేదని, రైతులు వేసిన ధిక్కరణ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరుతూ.. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి హైకోర్టులో అఫిడవిట్ వేశారు. హైకోర్టు తీర్పు అమలుకు సమయం పొడిగించాలని ఏప్రిల్ 1, జూన్ 21 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్లు వేసిందని గుర్తుచేశారు. హైకోర్టు తీర్పు తర్వాత రాజధానిలో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనుల కొనసాగింపునకు చర్యలు చేపట్టామన్నారు. రాజధాని అభివృద్ధికి భూములు వేలం వేయాలని జూన్ 6న ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కమిటీ అప్సెట్ ధర నిర్ణయించాక వేలం ప్రక్రియ జరుగుతుందన్నారు. ఆదాయం తక్కువ ఉన్న వర్గాలను దృష్టిలో పెట్టుకొని అమరావతిలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతి ఇచ్చిందన్నారు. 91.51 కోట్ల అంచనాతో 60 పనులకు టెండర్లు పిలిచిందన్నారు. రాజధాని పరిధిలోని 8 ప్రాంతాల్లో 5వేల 24 ఫ్లాట్లకు బాహ్య మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నాయన్నారు. కోర్టు ఉత్తర్వుల పట్ల ప్రభుత్వానికి గౌరవం ఉందన్నారు. ఉద్దేశపూర్వక ఉల్లంఘనకు పాల్పడలేదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు.
రాజధాని తీర్పు సందర్భంగా 50 వేల చొప్పున పిటిషనర్లకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆ సొమ్ము చెల్లించేలా చూడాలంటూ కొందరు పిటిషనర్లు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారని.. న్యాయవాది ఉన్నం మురళీధరరావు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు రిజిస్ట్రీ వద్ద ఆ సొమ్మును జమ చేశామని ఏజీ బదులిచ్చారు. దీంతో అనుబంధ పిటిషన్లను పరిష్కరిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలతో ముడిపడి ఉన్న మూడు వ్యాజ్యాలు విచారణకు నోచుకోవడం లేదని ఏజీ శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు వీలునుబట్టి విచారణ జరపాలని కోరారు. రికార్డులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.
ఇవీ చదవండి: