ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లులపై (NREGA bills) హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. తమకు బకాయిలు అందలేదని కొందరు.. కోతలు విధించారని మరి కొందరు హైకోర్టులో వేసిన పిటిషన్ల మేరకు హైకోర్టు విచారణ చేపట్టింది. గతంలో గ్రామీణ ఉపాధి హామి బిల్లుల పెండింగ్‌కు గాను రూ.1,121 కోట్ల నిధులను ఆయా పంచాయతీలకు జమ చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ నెల 4 నాటికి మిగిలిన మొత్తం సొమ్మును రూ.372 కోట్లు చెల్లించామని ప్రభుత్వం పేర్కొంది. అయితే తమకు పూర్తిగా చెల్లింపులు జరగలేదని.. కొన్ని చోట్ల 20 శాతం మేర బిల్లులు తగ్గించారంటూ పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీనిపై న్యాయస్థానం స్పందించి చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ ఖాతాల్లో పెండింగ్ బిల్లులు పడిన వెంటనే ఎలాంటి పనులకు ఉపయోగించకుండా జాగ్రత్తలు చేపట్టాలని.. ఎవరైనా అలా చేస్తే కోర్టు దిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దసరా సెలవుల తర్వాత విచారణ చేపడతామని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ (NREGA bills) , ఇతర పనుల బకాయిలను తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 12% వడ్డీని నాలుగు వారాల్లో చెల్లించాలంటూ గతంలో కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పటికే కొంత బకాయిలు పొందిన వారికి మిగిలిన సొమ్మును వెంటనే చెల్లించాలని స్పష్టం చేసింది. ఉపాధి పనులపై విజిలెన్స్ విచారణ పేరుతో 21% నిధుల్ని పట్టి ఉంచేందుకు (విత్‌హోల్డ్) వీలుకల్పిస్తూ పంచాయతీరాజ్‌శాఖ గతేడాది నవంబర్, ఈ ఏడాది మేలో జారీచేసిన రెండు మెమోలను రద్దు చేసింది. బిల్లులు చెల్లించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
నేపథ్యం ఇదే..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ (NREGA bills) పథకం కింద 2017, 2018, 2019 సంవత్సరాల్లో చేపట్టిన పనులు, ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన కోసం నిర్మాణ సామగ్రి నిమిత్తం చేసిన ఖర్చుల బకాయిలు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వెయ్యికి పైగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గతంలో న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం.. కొందరు పిటిషనర్లకు 79% బకాయిలు చెల్లించింది. విజిలెన్స్ విచారణ పేరుతో 21% ఆపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఉపాధి పనులకు విజిలెన్స్ విచారణ పేరుచెప్పి బిల్లులు నిలిపేయడం సరికాదన్నారు. కేంద్రం తన వాటా విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా పిటిషనర్లను ఇబ్బంది పెడుతోందన్నారు. పంచాయతీరాజ్‌శాఖ ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదనలు వినిపిస్తూ.. కేంద్రం నుంచి బకాయిల సొమ్ము రావాల్సి ఉందన్నారు. విజిలెన్స్ విచారణ పెండింగ్‌లో ఉండటంతో పిటిషనర్లకు బిల్లులు చెల్లించలేదన్నారు. వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదన్నారు.
ఇదీ చదవండి: