కరోనా కట్టడిలో భాగంగా జీవో 133 ప్రకారం ఏం చర్యలు తీసుకున్నారో పేర్కొంటూ కౌంటర్ ధాఖలు చేయాలని.. ఏపీఎస్ఆర్టీసీతో పాటు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలు, వాటికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సరైన స్ఫూర్తితో అమలు చేయాలని.. బస్సుల్ని 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలంటూ నెల్లూరుకు చెందిన న్యాయవాది శ్రీకాంత్ కోర్టును ఆశ్రయించారు. సోమవారం జరిగిన విచారణలో ప్రభుత్వ తరఫు న్యాయవాది కే నర్సిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రయాణికులు మాస్కులు, శానిటైజర్లు వినియోగించేలా చర్యలు తీసకుంటున్నామని తెలిపారు. ఆర్టీసీ తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్ స్పందిస్తూ.. రైళ్లు, విమానాలు, సినిమా హాళ్లు పూర్తి స్థాయి సామర్థ్యంతో నడుస్తున్నాయన్నారు. కేవలం ఆర్టీసీ బస్సులను 50 శాతం సామర్థ్యంతో నడపాలని కోరడం సరికాదన్నారు.
పిటిషనర్ స్పందిస్తూ.. భౌతిక దూరం పాటించే విషయంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రభుత్వం జీవో 133 జారీ చేసిందని దానిని సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ఆ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. పూర్తిస్థాయి సీట్లతో బస్సులు నడిపితే ప్రభుత్వ జీవో సరైన స్ఫూర్తితో అమలు చేసినట్లు కాదుకదా అని ప్రభుత్వ, ఆర్టీసీ తరఫు న్యాయవాదుల్ని ప్రశ్నించింది. ఆ జీవో ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశించి.. విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
ఇదీ చదవండి: కరోనాపై ఐదుగురు మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు