మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల సమీపంలోని వివిధ గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 9న తీసుకొచ్చిన ఏపి మున్సిపాలిటీ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎస్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పీఎస్పీ.సురేశ్ కుమార్, వై. సోమరాజు వాదనలు వినిపించారు.
అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలన్నారు. కౌంటర్‌కు సమయం ఇస్తే ఈ లోపు ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకుంటారేమోనని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏజీ స్పందిస్తూ కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల విషయంలో తదుపరి విచారణ వరకు ఎన్నికల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. ఆ వివరాల్ని నమోదు చేసిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ విచారణను సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది.
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్, కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ విషయాల్లో హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది .
ఇదీ చదవండి: సీఎంతో సెంచురీ ప్ల్లై బోర్టు ఇండియా సంస్థ సీఎండీ భేటీ... ఎందుకంటే..!