Ahobilam Temple: నిధులను దుర్వినియోగం చేసిన ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారిని అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి(ఈవో)గా నియమించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆరోపణలు ఉన్న అధికారిని ఈవోగా ఎలా నియమిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేవస్థానం ఈవోగా విధులు నిర్వహించకుండా ఆ అధికారిని నిలువరించింది. నేర చరిత ఉన్న వారిని తితిదే పాలక మండలిలో సభ్యులుగా నియమించారని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈవో నియామకం విషయంలోనూ అలాంటి చర్యలే పునరావృతం అయ్యాయని ఆక్షేపించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
కర్నూలు జిల్లా అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి ఈవో నియామకాన్ని సవాలు చేస్తూ కేబీ సేతురామన్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దేవాదాయశాఖ దాఖలు చేసిన కౌంటర్‌లో.. అహోబిలం ఈవోగా పనిచేస్తున్న అధికారి.. నిధుల దుర్వినియోగం చేశారని పేర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వమే ఆ విషయాన్ని ఒప్పుకుందన్నారు. అలాంటి వారిని ఈవోగా కొనసాగించడం సరికాదన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈవోగా బాధ్యతలు నిర్వహించకుండా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఇదీ చదవండి; పద్మావతి నిలయంలో కలెక్టరేట్... అనుమతిచ్చిన హైకోర్టు ధర్మాసనం