కరోనా నుంచి తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ కోలుకోలేకపోతుంది. లాక్డౌన్ తీసేసినా నష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో నిత్యం 33 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ... ఇప్పుడు ప్రతి డిపోలో 70శాతం బస్సులను మాత్రమే నడిపిస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీలో 2,750 బస్సులు మాత్రమే తిప్పుతున్నారు. నగర శివార్లలోని పల్లెలకు బస్సులు నడపడం లేదని పల్లె ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మండలంలోని చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లడంలేదని వాపోతున్నారు.
గతంలో నాలుగైదు ట్రిప్పులు వేసే బస్సులు.. ఇప్పుడు ఒక్క ట్రిప్పుకే పరిమితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామాల నుంచి విధుల కోసం వచ్చే డ్రైవర్లు, కండక్టర్లు సైతం ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేయాల్సి వస్తుందని తెలిపారు. ఇక గ్రేటర్ పరిధిలో సైతం చాలా వరకు బస్సులను తగ్గించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే రూట్లలో మాత్రమే బస్సులను తిప్పుతున్నారు. తక్కువ మంది ప్రయాణించే రూట్లలో బస్సులకు కోత విధించారు.
స్కూల్స్ తెరిస్తే..
కరోనా టైం కాబట్టి స్కూల్స్, కాలేజీలు మూసి ఉన్నాయి కాబట్టి ప్రయాణికుల సంఖ్య తగ్గింది. పాఠశాలలు, కళాశాలలు తెరిస్తే... సంఖ్య పెరుగుతుంది. అప్పుడు యథావిధిగా బస్సులు నడిపిస్తాం. అంతకుముందు 150 వరకు బస్సులు నడిచేవి... ఇప్పుడు 80 బస్సులను మాత్రమే నడిపిస్తున్నాం. మిగిలిన స్టాఫ్‌ని పాయింట్లలో ఉంచుతున్నాం.
-కవిత, కండక్టర్
సొంతవాహనాలు ఎక్కువై పోయాయి..
పబ్లిక్ ఎక్కడ చేయి చూపించిన బస్సు ఆపుతున్నాం. ఎక్కడ దిగాలన్నా ఆపుతున్నాం. అయినా సరే పబ్లిక్ రావట్లేదు. కాలేజీలు మూతపడటం ఒక కారణమైతే... సొంత వాహనాలు ఎక్కువై పోవడం వల్ల చాలా మంది బస్సులు ఎక్కట్లేదు.
-లక్ష్మణ్, కండక్టర్
చాలా మంది సొంత వాహనాలు కొనుగోలు చేయడం వల్ల బస్సుల్లో ప్రయాణించే వారు తగ్గిపోయారని కండక్టర్లు వాపోతున్నారు. తాము ఎంత కష్టపడినప్పటికీ... ప్రయాణికులు ఆర్టీసీ ప్రయాణానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదని ఆర్టీసీ సిబ్బంది అంటున్నారు. అందుకే ఇటీవలే ఆర్టీసీ... కళాకారులతో గ్రేటర్‌లోని డిపోలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. కనీసం ఈ విధంగానైనా ప్రయాణికులు ఆర్టీసీని ఆదరిస్తారని అధికారులు భావిస్తున్నారు.
మా బస్సులు ప్రస్తుతానికి నడవలేక చాలా మంది డిపోలోనే ఉంటున్నాం. బస్సులకు సర్వీసు చేయించాలని... స్పేర్ పార్ట్స్ లేవని ఏదొకటి చెప్పి ఇలా పాయింట్ల మీదకు పంపిస్తున్నారు. పాయింట్ మీద ప్యాసింజర్లను ఎక్కించాలంటా. నేను చేసేది కండక్టర్ జాబ్. ఈ పని చేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది.
-మధుసూదన్, కండక్టర్
నగరంలో 29 డిపోలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్‌కు ఏటా రూ. 540 కోట్లు నష్టం వాటిల్లుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. కరోనా తొలి దశలో ఆరు నెలలపాటు గ్రేటర్లో బస్సులు రోడ్డెక్కలేదు. నవంబరులో సాధారణ స్థితి నెలకొనడంతో బస్సులను తిప్పారు. మార్చిలో రెండోదశ వచ్చి అంతా తలకిందులైంది. సిబ్బంది పొదుపు చర్యలు చేపట్టి.. రికార్డు స్థాయిలో ఇంధన ఖర్చులు తగ్గించినా.. డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఏడాదిలో లీటరుకు రూ.25 పెరగడంతో ఆర్టీసీపై పెనుభారం పడుతోందని డ్రైవర్లు పేర్కొంటున్నారు.
కేవలం బస్సులను తిప్పడం ద్వారా మాత్రమే కాకుండా.. ఆర్టీసేతర ఆదాయంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్‌లో మొత్తం 8 కమ్యూనిటీ సెంటర్లున్నాయి. మిథాని, ఫరూక్‌నగర్, హయత్‌నగర్ కమ్యూనిటీ ఎమినిటీ సెంటర్లు ఇటీవల నిర్మించినవి కాగా.. పటాన్‌చెరు, కూకట్‌పల్లి, ఈసీఐఎల్, కోఠి, కాచిగూడ ఇప్పటికే నిర్మించారు. వాటిని అద్దెకు ఇస్తే.. ఆర్టీసీకి ఆదాయం సమకూరే అవకాశముంది.