పుర, నగరపాలక సంస్థల్లో పొరుగు సేవల కింద పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు కోసం అప్పట్లో పోరాటం చేశారు. దిగొచ్చిన ప్రభుత్వం రూ. 3 వేలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో గతంలో రూ. 12 వేలుగా ఉన్న వేతనాన్ని జనవరి నుంచి రూ. 15 వేలు చేస్తున్నట్లు తెలిపింది. జీతం పెరిగిందని సంబరపడిన పొరుగుసేవల పారిశుద్ధ్య కార్మికులకు వైకాపా ప్రభుత్వం మరో రూపంలో షాకిచ్చింది. 2019 ఆగస్టు నుంచి కార్మికులకు జీతంతో పాటు నెలకు రూ. 6 వేలు చొప్పున అదనంగా ఇచ్చిన వృత్తిపరమైన మెడికల్ అలవెన్స్‌ని నిలిపి వేసింది. జీతం పెరిగినప్పటి నుంచి మెడికల్ అలవెన్స్ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదు. రూ. 3 వేలు జీతం పెంచి.. రూ. 6 వేల మెడికల్ అలవెన్స్ ఆపేసింది.
పట్టణ స్థానిక సంస్థల్లో దాదాపు 33 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. రహదారులు, కాలువలు శుభ్రం చేయడంతో పాటు ఇళ్లు, దుకాణాల నుంచి వీరు చెత్త సేకరిస్తుంటారు. వైకాపాఅధికారంలోకి వచ్చాక నెలకు రూ. 12 వేల వేతనంతోపాటు ‘అక్యుపేషనల్ మెడికల్ అలవెన్స్’ కింద ఒక్కో కార్మికుడికి నెలకు రూ. 6 వేలు చొప్పున అదనంగా చెల్లించాలని నిర్ణయించింది. పుర, నగరపాలక సంస్థలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఈ మొత్తాలు చెల్లించేలా అప్పట్లో ఏర్పాట్లు చేశారు.
2019 ఆగస్టు నుంచి కార్మికుల బ్యాంకు ఖాతాల్లో మెడికల్ అలవెన్స్ జమ చేశారు. ఇప్పుడు ఆమొత్తాన్ని నిలిపివేశారు. గతంలో ప్రతి నెల రెండు, మూడు తేదీల్లో జీతం, పదో తేదీన మెడికల్ అలవెన్స్.. బ్యాంకు ఖాతాల్లో జమయ్యేదని కార్మికులు తెలిపారు. నాలుగు నెలలుగా రావడం లేదంటున్నారు. కరోనాని దృష్టిలో పెట్టుకొని మెడికల్ అలవెన్స్ ఇచ్చామని, ఇప్పుడా అవసరం లేదని అధికారులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో కొత్తగా పది నగర పంచాయతీలను ఏర్పాటు చేశారు. వీటిలో పని చేస్తున్న దాదాపు 4 వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు కూడా ‘ఆక్యుపేషనల్ మెడికల్ అలవెన్స్’ అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 2021 జూన్ 22న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ జీవో 63 జారీ చేసింది. నగర పంచాయతీల్లో కార్మికులకూ ప్రతి నెలా రూ. 6 వేలు చొప్పున మెడికల్ అలవెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ కమిషనర్‌ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఆదేశించారు. 10 నెలలైనా ఇప్పటికీ అది అమలు కాలేదు. దీని వల్ల ఒక్కో కార్మికుడు రూ. 60 వేల చొప్పున నష్టపోయారు.
ఇదీ చదవండి: జీవీఎంసీ పూర్వ కమిషనర్ హరినారాయణ్‌కు 3 నెలల జైలుశిక్ష