ప్రైవేటు బడులకు మూడు కేటగిరీలుగా బోధన రుసుములను నిర్ణయించాలని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ భావిస్తున్నట్లు తెలిసింది. పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించిన కమిషన్.. విద్యాసంస్థల ఆదాయ, వ్యయాలు, మౌలిక సదుపాయాలను ఇప్పటికే పరిశీలించింది. తనిఖీల్లో వెలుగుచూసిన అంశాల ఆధారంగా ఫీజును నిర్ణయించేందుకు కసరత్తు చేస్తోంది. గ్రామాలు, పట్టణాలు, నగరాల కేటగిరీలుగా బోధన రుసుములను నిర్ణయించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 14,500కు పైగా ప్రైవేటు పాఠశాలలున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం జులై నుంచి ప్రారంభం కానుంది. ఈలోపు రుసుములను నిర్ణయించాల్సి ఉంటుంది. పాఠశాలల ఆదాయ, వ్యయాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల వివరాలను సమర్పించాలని గతంలో కమిషన్ కోరగా.. దీనిపై కొన్ని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఫలితంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. ఈ ఏడాదికి బోధన రుసుములను నిర్ణయించక పోవడంతో గతేడాది ట్యూషన్ ఫీజులో 70 శాతం తీసుకోవాలంటూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాదికి బోధన రుసుములను ఖరారు చేయాల్సి ఉన్నందున మూడు కేటగిరీల విధానంపై ఆలోచిస్తోంది.
నిర్ణీత రుసుముపై అభ్యంతరాలుంటే..
మూడు కేటగిరీలుగా కమిషన్ నిర్ణయించే రుసుములు తమకు సరిపోవని ఏ యాజమాన్యమైనా భావిస్తే.. వారి ఆదాయ, వ్యయాలను సమర్పించే అవకాశం కల్పించనున్నారు. వాటి ఆధారంగా బోధన రుసుములను నిర్ణయించాలని భావిస్తున్నారు. మిగతా వారికి నిర్ణీత మొత్తమే ఉంటుంది. ఆదాయ, వ్యయాలు సమర్పించి బోధన రుసుములు నిర్ణయించాలని కోరే విద్యాసంస్థలు తక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోధన రుసుములపై ఎలాంటి విధానం పాటించాలనే దానిపైనా కసరత్తు చేస్తున్నారు.
షోకాజ్ నోటీసులు
ఇటీవల జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, బోధన రుసుముల వసూళ్లపై కమిషన్ తనిఖీలు నిర్వహించింది. దీనిపై ఆయా విద్యాసంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీటిపై యాజమాన్యాలు వివరణ ఇచ్చాక... చర్యల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని విద్యాసంస్థల అనుబంధ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ విద్యాసంవత్సరం ముగిశాక వీటిపై చర్యలు తీసుకునే అవకాశముంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకోనున్నారు.
ఇదీ చూడండి. 'మంత్రి పెద్దిరెడ్డి పీఏ పై చర్యలు తీసుకోవాలి'