Maha Padayatra : అమరావతి రైతుల మహాపాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. స్థానికులు, రాజకీయ నాయకులే కాకుండా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి.. రైతులకు మద్దతు తెలియజేస్తున్నారు. 14వ రోజున 15 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర..కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. అమరావతి నినాదాలతో సరిహద్దు గ్రామాలు హోరెత్తాయి.
రాజధాని రైతుల మహాపాదయాత్రకు 14వ రోజున మంచి స్పందన లభించింది. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నాగవరప్పాడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కొణికి గ్రామానికి చేరుకుంది. రైతులకు... ఎక్కడికక్కడ స్థానికులు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా ట్రాక్టర్లపై నుంచి రైతులపై పూలవర్షం కురిపించారు. వయసు, శరీరం సహకరించకపోయినా.. వృద్ధులు, మహిళలు.. పాదయాత్రలో భాగస్వాములై రైతులతో కలిసి నడిచారు.
ఆయా గ్రామాల్లోని ప్రజలు స్వచ్ఛందంగా ఎదురొచ్చి.. రైతులకు బిస్కెట్లు, శీతల పానీయాలు అందజేసి సంఘీభావం తెలిపారు. నందిగామకు చెందిన రైతులు 50 అడుగుల జెండాలను పాదయాత్రలో ప్రదర్శించారు. పాదయాత్రకు అన్ని ప్రాంతాల్లో విశేష స్పందన లభిస్తోందని.. అమరావతే రాజధానిగా ఉండాలన్న అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారని.. రాజధాని రైతులు అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే.. సీఎం జగన్, మంత్రులు.. విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
మహాపాదయాత్రకు వైకాపా మినహా అన్ని రాజకీయా పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. తెలుగుదేశం నేతలు దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య సహా కార్యకర్తలు రైతులకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. జగన్ చేస్తున్న మోసాలు ప్రజలకు అర్థమవుతున్నాయని.. తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు.
శనివారం గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ దృష్ట్యా.. ఆదివారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కృష్ణా జిల్లాలో 6 రోజుల పాటు సాగిన పాదయాత్ర.. ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. కృష్ణా జిల్లా కుదరవల్లికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. ఏలూరు జిల్లాలోకి పాదయాత్రను ఆహ్వానించారు. అమరావతి నినాదాలతో కృష్ణా, ఏలూరు జిల్లాల సరిహద్దు గ్రామాలు మార్మోగాయి. కృష్ణా జిల్లా ప్రజలు చూపిన ఆదరాభిమానాలు మరువలేనివి ఐకాస నేతలు కొనియాడారు.
పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా కుయుక్తులు : అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఆటంకం సృష్టించేలా వైకాపా నేతలు కుయుక్తులు ప్రదర్శిస్తున్నారు. పాదయాత్ర కొనసాగే నందివాడ మండల ప్రధాన రహదారికి అడ్డంగా మరమ్మతుల పేరుతో ఇసుక టిప్పర్ లారీని నిలిపివేశారు. ఆ లారీని నందివాడ ఎంపీపీ పేయ్యల అదాంకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. రోడ్డుపై నుంచి టిప్పర్ లారీను తొలగించకుంటే పాదయాత్ర ముందుకు కదలదని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో, జేసీబీ సహాయంతో లారీను పోలీసులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవీ చదవండి: